టెక్నాలజీ సత్తా ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేసిన శక్తుల్లో సోషల్ మీడియా కూడా ఒకటి. మోడీ ప్రసంగాలు, భాజపా విధానాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాతోపాటు, వివిధ మొబైల్ అప్లికేషన్ల ద్వారా యువతకు చేరువ చేశారు. పార్టీకి సంబంధించిన ఫేస్ బుక్, వాట్సాప్ గ్రూపులు, యూట్యూబ్, ట్విట్టర్ వంటి మాధ్యమాలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా బడ్జెట్లు కేటాయించి మరీ ఖర్చు చేశారు. టీడీపీ, తెరాస విజయంలో కూడా సామాజిక మాధ్యమాల పాత్ర చాలా కీలకమైంది. అయితే, వందేళ్ల చరిత్రగల పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్, ఇన్నాళ్లకు టెక్నాలజీ ప్రాధాన్యతను గుర్తించింది! దాని కోసం ప్రత్యేకంగా ‘శక్తి’ అనే ఒక మొబైల్ ఆప్ ను తయారు చేశారు. దీంతోపాటు సోషల్ మీడియా ప్రాధాన్యత గురించి కూడా ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు.
గత ఎన్నికల్లో భాజపాను అధికారంలోకి తెచ్చేందుకు సోషల్ మీడియా ఎంత కీలక పాత్ర పోషించిందో, అదే రీతిలో వచ్చే ఎన్నికల్లో భాజపాను ఓడించే అస్త్రంగా సామాజిక మాధ్యమాలను వాడుకోబోతున్నామంటూ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అంటున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ ల ద్వారా కూడా ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తామని చెబుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, ‘శక్తి’ అంటూ ఒక మొబైల్ అప్లికేషన్ ను కొత్తగా అందుబాటులోకి తేవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇది ప్రధాని నరేంద్ర మోడీ ఆప్ లా ఉంటుందని అనుకుంటే పొరపాటే! అందరికీ అందుబాటులో ఉంటుందా అంటే.. అబ్బే, కేవలం పార్టీ కార్యకర్తలకు మాత్రమేనట! ఈ శక్తి కేవలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే పరిమితం. అంతేకాదు, ఈ ఆప్ ను కార్యకర్తలైనా, నాయకులైనా ఎవరికివారు డౌన్ లోడ్ చేసుకోలేరు. కమిటీ అనుమతించినవారికే ‘శక్తి’ లభిస్తుంది. అలా అనుమతి పొందినవారికి మాత్రమే డౌన్ లోడ్ అవకాశం ఇస్తారట.
అందరికీ అందుబాటులోకి రానప్పుడు ఈ ఆప్ ఉపయోగం ఏముంటుందీ అంటే… పార్టీలో సమన్వయం పెరుగుతుందని చెబుతున్నారు! పీసీసీ అధ్యక్షుడినే కాదే, ఏకంగా ఏఐసీసీకి ఉపాధ్యక్షుడికి కూడా పార్టీ శ్రేణులవారు సలహాలు ఇచ్చేందుకు ఈ ఆప్ పనికొస్తుందని చెబుతున్నారు. నిజానికి, ఏ పార్టీ కార్యకర్తలైనా ఎలాగూ ఆ పార్టీకి అనుబంధంగా, అనుకూలంగా ఉంటారు కదా! వారి కోసం ఏదో కొత్తగా చేయాల్సిన అవసరం ఉండదు. స్థానిక నేతలకు వారికి అందుబాటులో ఉంటే చాలు. సామాన్యులను, యువతను ఆకర్షించే విధంగా ఇలాంటి మొబైల్ అప్లికేషన్లు ఉంటే పార్టీకి ఉపయోగపడతాయి. అంతేగానీ, ఒక యాప్ తెస్తున్నామనీ.. అదో అద్భుతం అని వారిలో వారు చెప్పుకుంటూ, అది అందరికీ అందుబాటులో ఉండదని చెప్పడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది..? సరే, సోషల్ మీడియా విషయంలో కూడా ఇవాళ్లే ప్రాధాన్యతను గుర్తించినట్టు మాట్లాడుతుంటే… సాంకేతికంగా వారి వెనకబాటుతనాన్ని బయట పెట్టుకున్నట్టు అవుతోందనే విషయం కాంగ్రెస్ నేతలకు అనిపించడం లేదేమో!