సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. సీఎం, ఆయన సోదరులు అంటూ అవినీతి మరకలు అంటించేందుకు రోజుకో వ్యవహరం బయటకు తీస్తున్నారు. సీఎం అమెరికా పర్యటన తర్వాత బీఆర్ఎస్ విమర్శల దాడి మరింత పెరిగింది.
నిజానికి రైతు రుణమాఫీ తర్వాత గ్రౌండ్ లో కాంగ్రెస్ కు కాస్త అడ్వాంటేజ్ వచ్చింది. కానీ, దాన్ని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకోలేకపోతుందని… స్వయంగా సీఎంను టార్గెట్ చేసి కేటీఆర్, హరీష్, బీఆర్ఎస్ సోషల్ మీడియా దాడి చేస్తుంటే ఒక్క మంత్రి కూడా తిప్పి కొట్టలేకపోతున్నారన్న చర్చ బలంగా నడుస్తోంది.
ఈ తరుణంలో… సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన నుండి రాగానే బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ నుండి ముగ్గురు ఎమ్మెల్యేలను రోజుకు ఒక్కొక్కరు చొప్పున పార్టీలో చేర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ దూకుడుకు గాలం వేయాలంటే ఎమ్మెల్యేల చేరికలే పరిష్కారం అని కాంగ్రెస్ భావిస్తోంది.
గ్రేటర్ పరిధిలో… గతంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసిన నాయకులు పార్టీ మారబోతున్నారు. ఇప్పటికే చర్చలు కూడా పూర్తైనట్లు సమాచారం. ఇందులో ఓ మాజీ మంత్రి ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా, చివరి నిమిషం వరకు సస్పెన్స్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది.
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో తన పీఆర్ టీం ఫెయిల్యూర్ అయ్యింది అనేది కాంగ్రెస్ నేతలు కూడా ఒప్పుకుంటున్న మాటే. దీంతో సీఎం హైదరాబాద్ రాగానే, ఆయన్ను అభినందిస్తూ వరుసగా రెండు మూడు రోజులు హడావిడి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ చేరికలు ఉంటే బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేయవచ్చన్న అభిప్రాయంతో కాంగ్రెస్ ఉంది. కానీ ఇదైనా అనుకున్నట్లుగా వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.