నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అంటారు. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి మరీ అధికార పార్టీ తెరాస సత్తా చాటుకుంది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి… ఆ జిల్లాపైనే రెండు పార్టీలూ మళ్లీ పట్టు కోసం పాకులాడుతున్నాయి. ముఖ్యంగా భువనగిరి నుంచి ఎంపీగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపు కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో తెరాస ఎంపీగా చిరుమర్తి లింగయ్య ఇక్కడ్నుంచి గెలిచారు. ఈసారీ తెరాస నుంచి ఆయనే బరిలోకి దిగారు. గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈయన చేతిలోనే 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
స్వల్ప మెజారిటీతోనే కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఓడిపోయిందనీ, కాస్త కష్టపడితే భువనగిరిలో మరోసారి జెండా ఎగరెయ్యొచ్చు అనేది కాంగ్రెస్ అంచనా. అసెంబ్లీ ఎన్నికల లెక్కల ప్రకారం చూసుకుంటే… భువనగిరి పరిధిలోని కాంగ్రెస్ కంటే తెరాసకు 50 వేల ఓట్ల ఆధిక్యం ఉంది. అయితే, భువనగిరి పరిధిలో కోమటిరెడ్డి సోదరులకు మంచి ఆదరణ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటరెడ్డి ఓడిపోయారు. ఆ సానుభూతి ఈసారి కలిసొస్తుందనీ అంచనా వేస్తున్నారు.
కానీ, వెంకటరెడ్డి అంచనాలను దెబ్బతీస్తూ ఆయన అనుచరుడైన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను తెరాసలోకి ఆకర్షించారు కేసీఆర్. దీంతో కాంగ్రెస్ కి మరింత బలం తగ్గినట్టే అనేది తెరాస అంచనా. అయితే, లింగయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నది కోమటిరెడ్డి సొంత నియోజక వర్గం కావడంతో… నష్టం పెద్దగా ఉండదు అనేది కాంగ్రెస్ అంచనా. ఆలేరు డీసీసీ అధ్యక్షుడు కూడా చివరి నిమిషంలో కాంగ్రెస్ కి చెయ్యిచ్చి పార్టీ మారిపోయారు. ఇదీ కోమటిరెడ్డికి సమస్యే. అయితే, ఈ సవాళ్లను అధిగమించే విధంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందనీ, ఈ ఎన్నికల్లో అది బయటకి వస్తుందనేది కాంగ్రెస్ నమ్మకం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎంపీగా గెలిపించుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఇజ్జత్ గా సవాల్ గా మారింది. అందుకే, కోమటిరెడ్డి సోదరులతోపాటు ఇతర నేతలూ ఈ లోక్ సభ స్థానంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ పరిస్థితులన్నీ కాంగ్రెస్ కి ఎంతవరకూ అనుకూలిస్తాయో వేచి చూడాలి.