ఎస్ఈసీ రమేష్‌కుమార్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ సర్కార్.. సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తోంది. పలువురు నేతలు ఈ విషయాన్ని మీడియా ముఖంగా ప్రకటించారు. దీంతో ఒక వేళ ఏపీ సర్కార్ పిటిషన్ వేసిన వెంటనే….స్టే దొరకుండా…వివిధ రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మస్తాన్ వలీ తన న్యాయవాదితో ఈ మేరకు కేవియట్ దాఖలు చేయించారు. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే.. తమ వాదన విన్న తర్వాత ఎలాంటి ఆదేశాలైనా ఇవ్వాలని కోరుతూ..ఈ కేవియట్ దాఖలయింది.
హైకోర్టు తీర్పు అందిన వెంటనే.. రమేష్ కుమార్.. తాను ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లుగా ప్రకటన విడుదల చేశారు. లాక్ డౌన్ ప్రకటించడానికి ముందు కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆయన హైదరాబాద్ నుంచి పని చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఆ కార్యాలయంతో పాటు… విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయం నుంచి కూడా విధులు నిర్వహించనున్నారు. సోమవారం ఆయన విజయవాడ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చే లాక్ డౌన్ సడలింపుల ఆధారంగా.. ఆయన రాజకీయపార్టీలతో సమావేశం నిర్వహించి…ఎన్నికల విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఎస్ఈసీగా ఉన్నప్పుడు కనగరాజ్ ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేస్తూ.. ఓ ఉత్తర్వు ఇచ్చారు. ఆయన నియామకమే చెల్లదని.. తేలింది కాబట్టి .. ఆ ఉత్తర్వులు కూడా చెల్లవు. దాంతో గతంలో తాను జారీ చేసిన ఆరు వారాల వాయిదా ఉత్తర్వులకు కొనసాగింపుగా మరో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఆయనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంది కాబట్టి.. ముందు జాగ్రత్తగా..కొంత మంది సుప్రీంకోర్టులో కేవియట్ వేస్తున్నారు.