రాహుల్ గాంధీ తెలంగాణాలో పర్యటించి పార్టీని ఏమి ఉద్దరించారో తెలియదు కానీ ఈనెల 24న ఆంధ్రాలో అనంతపూర్ జిల్లాని కూడా పావనం చేయబోతున్నారు. కానీ ఆయన కాలు పెడితే రాష్ట్రం అపవిత్రం అయిపోతుందని జిల్లాకి చెందిన అధికార పార్టీ నేతలు అంటున్నారు. కానీ యువరాజా వారు వేంచేయడం ఖాయం అయింది కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ జీవులు (బహువచనం వాడటం అనవసరమేమో?) అంటే పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆయన పాదయాత్ర చేయబోయే ఓడిచెరువు మండలం నుంచి నల్లమాడ గ్రామం వరకు రూట్ మ్యాప్ ని పరిశీలించి, అవసరమయిన ఏర్పాట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంతకు ముందు రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు మీడియాలో నిత్యం కనిపించిన మాజీ మంత్రి శైలజానాద్ ఎన్నికల తరువాత నుండి పెద్దగా కనబడటం లేదు. కానీ ఈరోజు రఘువీరుడితో కలిసి యువరాజావారికి ఎటువంటి స్వాగత సన్నాహాలు చేస్తే బాగుంటుందో చర్చించినట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కౌరవసేనలా ఎక్కడచూసినా కనబడేది. కానీ ఇప్పుడు అది కూడా జనసేనలా తయారయింది. జనసేనకి పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ కి రఘువీర మాత్రమే కనబడున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆ ఒక్కడూ కూడా రాజ్యసభ సీట్ కోసం సీరియస్ గా ట్రై చేస్తున్నట్లు సమాచారం. అందుకే ఎవరికి తప్పినా ఆయనకి మాత్రం తప్పడం లేదు. ఆ టైంకి ‘పూరీ’ సెకండ్ హాఫ్ స్టోరీ చెప్పడం మొదలుపెట్టకపోతే మరో (చిరం) జీవి కూడా రాహుల్ గాంధీతో కలిసి మారథాన్ (పాదయాత్ర) లో పాల్గొనే అవకాశముంది.
ఇంకా పార్టీలో మరికొన్నాళ్ళు ఉండాలనుకొనే వాళ్ళు కూడా ఆయన వెనుక ఆపసోపాలు పడుతూ పరుగులు తీయక తప్పదు. కానీ ఈ మారథాన్ లో పాల్గోవాలనుకొంటున్న కాంగ్రెస్ జీవులన్నీ ముందుగా ఓసారి తమ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు చెక్ చేసుకొని మరీ పాల్గొంటే మంచిది. అంటే రాహుల్ తో సమానంగా పరుగులు తీయగలరా లేదా? అని తేల్చుకొనేందుకుకాదు…తమకి ఏజ్ బార్ అయిపోయిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికే! ఎందుకంటే 50 దాటిన వారందరినీ పక్కనబెట్టేయాలని యువరాజా వారు కమిట్ అయిపోయారు!
ఆ సంగతి అందరి కంటే ముందుగా పసిగట్టిన బొత్స సత్యనారాయణ అందుకే మొన్న పార్టీలో నుండి జంపేసారు. కానీ డి. శ్రీనివాస్ కి ఆ ఇంగితం లేకపోవడంతో రెండవసారి ఎమ్మెల్సీ కుర్చీ కావాలని మారాం చేసి భంగపడ్డారు. ఆయన కుర్చీని యువతకి అంటే ఆకుల లలితకి ఇచ్చేసాక గానీ ఆయనకి జ్ఞానోదయం కాలేదు. అయిన తరువాత మరిక టీం వెస్ట్ చేయకుండా ఆ ఏజ్ లిమిట్స్ గట్రా లేని తెరాసలోకి దూకేశారు. అందుకే రాహుల్ గాంధీ వెనుక పరుగులు తీయాలనుకొంటున్న కాంగ్రెస్ జీవుల్లారా….ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ సర్తిఫికేట్లు చెక్ చేసుకోండి. లేకుంటే ఆనక ఆయాసం తప్ప మరేమీ మిగలదు స్మీ!