రేవంత్ నాయకత్వంపై తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ సీనియర్ల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా అయిపోయింది. కేంద్రం తరపున దూత వచ్చి వెళ్లారు కానీ.. వారికేమీ పరిష్కారం లభించలేదు. ఇప్పుడు వారు ఏ నిర్ణయం తీసుకోవాలో అయోమయంలో పడిపోయారు. కాంగ్రెస్ లో ఉండాలంటే … రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా చేయాలి. బయటకు వెళ్లాలంటే ఇతర పార్టీల్లో చేరిపోవాలి. ఇప్పటికిప్పుడు రేవంత్ ను కానీ.. ఠాగూర్ ను కానీ మార్చే ఆలోచనే లేదని స్పష్టమవుతోంది. హైకమాండ్ తమను ఏదో విధంగా సంతృప్తి పరుస్తుందని.. తమకు కొంత బలం చేకూరురుస్తుందని సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు.
అలాంటి చాన్స్ లేదని దిగ్విజయ్ సందేశం ఇచ్చి వెళ్లారు.మరి ఇప్పుడు వారేం చేయబోతున్నారు ? పీసీసీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో వారు పాల్గొనరు. రేవంత్ నేతృత్వంలో పీసీసీ.. తన పని తాను చేసుకుపోతోంది. పాదయాత్ర కూడా ప్రకటించింది. దిగ్విజయ్ వచ్చి వెళ్లిన తర్వాత రేవంత్ వర్గం మరింత బలం పుంజుకున్నట్లయింది. రేవంత్ రెడ్డిని ఎలాగైనా నియంత్రించాలన్న ఉద్దేశంలో ఆవేశపడి.. సీనియర్ నేతలు పార్టీకి దూరం అయ్యారు. రేవంత్ ఆధ్వర్యంలో తాము పని చేయలేమన్నట్లుగా ప్రకటనలు చేశారు.
దీంతో తమంతట తాము తగ్గితే ఇప్పుడు పార్టీలోనే చులకన అయిపోతారు. ఇప్పుడు పార్టీలోనే ఉన్నా.. వారికి ఆదరణ ఉండదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఇతర పార్టీల్లో చేరితే భవిష్యత్ ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. భారతీయ జనతా పార్టీ ఈ సీనియర్లకు ఆహ్వానం పలకడానిక ిరెడీగా ఉంది. కానీ కాంగ్రెస్ లో ఉన్నంత సీనియార్టీ.. అక్కడ ఉండదు. టీఆర్ఎస్ వైపు చూసినా అంతే. అందుకే ఇప్పుడు సీనియర్లు .. అటూ ఇటూ కాకుండా అయిపోయారన్న వాదన వినిపిస్తోంది.