ఒక్క హామీ.. ఒకే ఒక్క హామీ ప్రజల్లోకి వెళ్తే… రాజకీయ పార్టీకి విజయం లభించినట్లే. నాడు వైఎస్ ఉచిత విద్యుత్, చంద్రబాబు రుణమాఫీలు అధికారాన్ని తెచ్చి పెట్టాయి. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్‌కు అలాంటి నినాదమే దొరికినట్లు కనిపిస్తోంది. పేదలకు ఏడాదికి కనీసం రూ. 72వేల ఆదాయ హామీ పథకమే ఇప్పుడు హైలెట్ అవుతోంది. ప్రతిపక్ష పార్టీ ఇలాంటి హామీ ఇచ్చినప్పుడు.. అధికార పార్టీగా ఉన్నవారు.. అసాధ్యం అని అన్నారంటే.. ఆ హామీకి క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. ఈ పథకంపై బీజేపీ విమర్శలు చేస్తూ ఉండటంతో.. మరింతగా ప్రజల్లోకి వెళ్తోంది.
ఉత్తరాది ఓటర్లలో “న్యాయ్” పథకంపై సానుకూలత..!
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయం పథకం ఉత్తరాది ఓటర్లపై తీవ్రమైన ప్రభావమే చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశంలో 5 కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏడాదికి 72 వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని రాహుల్ ప్రకటించిన వెంటనే బీజేపీ సీనియర్ నేతలు దానిపై రహస్య విశ్లేషణ చేశారు. బీజేపీ అంతర్గత అంచనాల ప్రకారం రైతాంగ సంక్షోభం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కనీసం 30 సీట్లు బీజేపీ కోల్పోవచ్చని తేలింది. బాలాకోట్ దాడుల తర్వాత బీజేపీ కనీసం 230-240 సీట్లు సాధిస్తుందని అనుకున్నామని, కానీ ఇప్పుడు కనీసం 30 సీట్లు తగ్గిపోతాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. బాలాకోట్ ప్రభావం తాలూకు ఊపు కూడా మొదట్లో ఉన్నంత ఇప్పుడు కనపడకపోవడం కూడా బీజేపీ నేతలను నిరాశపరుస్తోంది.
బీజేపీకి ఓ వైపు రైతులు..మరో వైపు పేదల దెబ్బ..!
రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్‌ఘడ్‌లో ఓటింగ్ సరళిపై రాహుల్ కనీస ఆదాయ పథకం ప్రభావం చూపుతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఉపాధి హామీ పథకం ప్రభావం చూపినట్టే.. కనీస ఆదాయ పథకం ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లో మొత్తం 25 సీట్లు, జార్ఖండ్‌లో 14లో 12, మధ్యప్రదేశ్‌లో 29కి 27, చత్తీస్‌ఘడ్‌లో 11కు గాను 10 సీట్లు బీజేపీ గెలిచింది. ఇప్పుడు న్యాయ్ పథకంతో ఈ సీట్లలో కోత పడటం ఖాయంగా కనిపిస్తోంది.
అదే తరహా పథకం కోసం మేనిఫెస్టో ప్రకటన ఆపేసిన బీజేపీ..!
రాహుల్ న్యాయ్ పథకం ప్రకటించడంతో బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడం కూడా ఆలస్యం చేసింది. న్యాయ్ పథకానికి విరుగుడుగా బీజేపీ మరో పథకం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇప్పటికే ప్రజలకు వెళ్లాల్సిన సంకేతం వెళ్లిపోయిందని, ప్రధాని పేదలకు ఏడాదికి 6 వేలు చెల్లిస్తానని ప్రకటిస్తే.. కాంగ్రెస్ నెలకు 6 వేలు జమ చేస్తామని ప్రకటించడం ప్రజల్లోకి వెళ్లిపోయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అనావృష్టి, రైతాంగ సంక్షోభం తీవ్రంగా ఉన్నందువల్ల రాహుల్ ప్రకటించిన పథకం గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపించవచ్చని బీజేపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.