తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ ఒకటే ఆప్షన్ ఇస్తోంది. టిక్కెట్ ఇచ్చిన చోట పోటీ చేస్తారా లేకపోతే ఎవరి దారి వారు చూసుకుంటారా అని తేల్చేస్తోంది. పార్టీలో చేరికల్ని అడ్డుకున్నా ఊరుకునేది లేదని హెచ్చరికలు పంపింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి… నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చేరికను అడ్డుకునేందుకు మీడియాకు కూడా ఎక్కారు. ఇక చేరికల్లేవని … కాంగ్రెస్ ఓవర్ లోడ్ అయిందని చెప్పుకొచ్చారు. కానీ ఆయనకు కాంగ్రెస్ లో విలువ లేదని హైకమాండ్ తేల్చేసింది. వేముల వీరేశాన్ని కూడా పార్టీలో చేర్చుకుంది.
సీనియర్ నేతలు టిక్కెట్ల విషయంలో జోక్యం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొడుతోంది. టికెట్ల విషయంలో తాము రిస్క్ తీసుకుంటే, ఎన్నికల్లో పార్టీ కుప్పకూలుతుందని .. సీనియర్లను నమ్మలేమని చెబుతున్నారు. బీఆర్ఎస్ అంగ, ఆర్థిక బలాన్ని ధీటుగా ఎదుర్కొనే నాయకులకు టిక్కెట్లు ఇవ్వాలని నిర్మయించుకుంది. టికెటు ఇప్పించుకోవడం, ఆ తర్వాత చేతులెత్తేయడం … గాల్లో గెలిస్తే మా ఘనత అని చెప్పుకోవడం సీనియర్లకు రివాజుగా మారిది. టీడీపీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలైనా సరే…గెలువడమే ముఖ్యమని… అటువంటి వారికే టికెట్లు ఇస్తామని ఇందులో మరో మాట లేదని సీనియర్లకు తేల్చేసింది.
జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండాసురేఖ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితోపాటు అందరికీ ఒక్క టిక్కెట్ మాత్రమే ఆఫర్ ఇస్తోంది. బీఫామ్ మీక్కావాలో, మీ కుటుంబ సభ్యులకు కావాలో తేల్చుకోవాలని స్పష్టంచేసింది. మైనంపల్లి లాంటి వారికి రెండు టిక్కెట్లు ఎందుకంటే… ఆ స్థాయిలో గెలిపించుకుని వస్తామన్న నమ్మకం కల్పించాలని సీనియర్లను పార్టీ హైకమాండ్ కోరుతోంది. ఈ సారి విజయానికి అడ్డదారులుండవు అనే కాన్సెప్ట్ ను … కాంగ్రెస్ హైకమాండ్ పక్కాగా అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.