హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ పరువు పోయింది. డిపాజిట్ కాదు కదా..ఆ దగ్గరకు కూడా రాలేదు. చివరికి ఏపీలో ఉపఎన్నిక జరిగిన బద్వేలు రౌండ్‌కు ఐదారు వందల ఓట్లు తెచ్చుకున్నారు కానీ హుజురాబాద్‌లో మాత్రం రెండు, మూడు వందల స్థాయిని కూడా ఏ దశలోనూ దాటలేదు. ఇంత ఘోరంగా పరువు పోయినా కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తమ అంతర్గత రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అలా ఫలితాలు ఐదారు రౌండ్లు రాక ముందే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెర ముందుకు వచ్చేశారు. రేవంత్ రెడ్డిపై పరోక్ష విమర్శలు ప్రారంభించారు.
శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సిద్ధాంతం ప్రకారం ఈటల రాజేందర్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వక తప్పలేదని కోమటిరెడ్డి ప్రకటించేశారు. కాంగ్రెస్ గట్టిగా పోరాడితే ఓట్లు చీలిపోయి, చివరకు టీఆర్ఎస్ కు లాభం చేకూరుతుందనే తాము కాస్త వెనక్కి తగ్గామని … ఈటలకు పరోక్షంగా మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. నాగార్జునసాగర్, దుబ్బాక ఎన్నికల్లో పని చేసినట్టు హుజూరాబాద్ లో తాము చేయలేదన్నారు. అన్నింటినీ హైకమాండ్‌కు చెబుతామన్నారు . బీజేపీకి మద్దతు అంటే హైకమాండ్ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఖాయం. ఈ కోణంలోనే కోమటిరెడ్డి .. రేవంత్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. కోమటిరెడ్డి వ్యాఖ్యల కలకలం ఉండగానే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పందించారు.
పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ చేసిన నిర్వాకాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ లోపు జగ్గారెడ్డి కూడా తెర ముందుకు వచ్చారు. కాంగ్రెస్ కు డిపాజిట్ వస్తే రేవంత్ ఘనత లేకపోతే సీనియర్ల తప్పిదమని ప్రచారం చేయడానికి ప్లాన్ చేశారని ఆరోపించారు. వీరి వాదోపవాదాలు ఇలా సాగుతూండగా.. రేవంత్ రెడ్డి ప్రజాతీర్పును శిరసావహిస్తామని.. ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలకు సంపూర్ణ బాధ్యత తనదేనన్నారు. కాంగ్రెస్‌లో సీనియర్లకు కాస్త స్వేచ్చ ఎక్కుని.. సందర్భం వచ్చినప్పుడు వారి గురించి స్పందిస్తానని చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కాంగ్రెస్ రాజకీయం.. కాంగ్రెస్ చేసుకుంటూనే ఉంటుంది.