కాంగ్రెస్ అద్యక్ష పీఠం అధిష్టించబోతున్న రాహుల్‌గాంధీ తన నాయకత్వాన్ని నాయనమ్మ ఇందిరాగాంధీ సెంటిమెంటుతో ముడిపెట్టారు. నవంబరు 19-21 మధ్య కర్ణాటకలోని చిక్మగళూరులో ప్రచారం ప్రారంభించాలని ఆయన అనుకుంటున్నారట.1977లో ఎమర్జన్సీ అనంతరం ఓడిపోయిన ఇందిరాగాంధీ చిక్‌మగళూరు ఉప ఎన్నికల్లో ఓడిపోవడం ద్వారానే మళ్లీ పార్లమెంటులో ప్రవేశించారు. అయితే అప్పటి జనతా ప్రభుత్వం ఆమెపై ఏదో అవినీతి కేసు పెట్టి అరెస్టు చేయడమే గాక ఎమర్జన్సీ విధించినందుకు గాను పార్లమెంటు నుంచి బహిష్కరించింది. అయితే మరో రెండేళ్లలో 1980 ఎన్నికలలో ఆమె ఘన విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రాగలిగారు. నవంబరు 19 ఇందిర శతజయంతి వేడుకలు కూడా మొదలవుతాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్‌గాంధీ నానమ్మతో ముడిపడిన చిక్‌మగళూరును తన తొలి ప్రచార వేదికగా ఎంచుకుంటున్నారట. కర్ణాటకలోనూ శాసనసభ ఎన్నికలు జరగవలసి వుంది. అక్కడ కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపించుకోవడం వారికి చాలా అవసరమే. ఆ రీత్యా కూడా ఈ ఎంపిక జరిగినట్టు కనిపిస్తుంది.