పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాతనే మంత్రి వర్గ విస్తరణ … నామినేటెడ్ పదువుల భర్తీని చేయాలని రేవంత్ నిర్మయించారు. గెలిచిన తర్వాత తొలి సారి టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ గ్రామ కమిటీల చేతుల మీదుగానే పాలన జరుగుతుందని.. పార్టీ నేతల చేతుల మీదుగానే సంక్షేమ పథకాలు అమలు అవుతాయని ప్రకటించారు.
కష్టపడి పని చేసిన వారిని గుర్తించి, వారికి సముచిత గౌరవాన్ని ఇచ్చేందుకు ఏఐసీసీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామని భరోసానిచ్చింది. వీలైనంత త్వరగా వివిధ కార్పొరేషన్లకు చైర్మెన్లు నియమించాలని నిర్ణయించి, అందుకు సంబంధించిన జాబితాను సిద్ధం చేసే బాధ్యత కొత్త ఇన్చార్జి దీపాదాస్ మున్షికి అప్పగించింది. ఆ జాబితాను అధిష్టానానికి పంపించి అక్కడ ఆమోదం తీసుకోనుంది. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలుస్తోంది.
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ తీర్మానాలు కూడా చేశారు. అయితే పార్లమెంట్ ఎన్నికల బాధ్యత పూర్తిగా రేవంత్ రెడ్డి మీదనే ఉంది. ఆయన కూడా ఈ టాస్క్ తీసుకున్నారు. కనీసం పన్నెండు సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వయంగా సమీక్షలు ప్రారంభించబోతున్నారు. హైకమాండ్ కూడా ఈ విషయంలో రేవంత్ కే ప్రాధాన్యం ఇస్తోంది. పదవుల విషయంలోనూ రేవంత్ చాయిస్ కే ప్రాధాన్యమిస్తున్నారు.