వరంగల్ ,ఖమ్మం , నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందటం లేదనే చర్చ జరుగుతోంది. మల్లన్నను గెలిపించాలని నేతలు ప్రకటనలు చేస్తున్నారు తప్పితే అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో నేరుగా పాల్గొనకపోవడం చర్చనీయాంశం అవుతోంది.
ఓ వైపు బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించేందుకు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి కోసం కేటీఆర్ ప్రచారం నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. కానీ, తీన్మార్ మల్లన్నకు మద్దతుగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ మంత్రులు, ఎమ్మెల్యేలు సీరియస్ గా ప్రచారం నిర్వహించకపోవడంతో ఒక్కడై ప్రచారంలో ముందుకు సాగుతున్నాడు మల్లన్న.
మల్లన్న ఎలాగూ గెలుస్తాడని ప్రచారంలో భాగస్వామ్యం కావడం లేదా..? లేదంటే మల్లన్న గెలిస్తే పార్టీకి తలనొప్పులు తెచ్చి పెడుతాడని దూరంగా ఉంటున్నారా..? లేక గతంలో తీవ్రంగా విమర్శించడంతో వాటిని మనసులో పెట్టుకొనే మల్లన్నకు మద్దతుగా నేతలు ప్రచారంలో భాగస్వామ్యం కావడం లేదా..? అని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.