తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మొదట్నుంచీ ఉన్న సమస్యే ఇది! ఓపక్క రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు అది చేసేస్తాం, ఇది చేసేస్తామన్నట్టు కొంతమంది నాయకులు మాట్లాడుతుంటే… మరోపక్క ఆ స్ఫూర్తికి అడ్డంగా తూట్లు పొడిచే పనిలో కొంతమంది నాయకులు ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల పరాజయం తరువాత పార్టీ కోలుకునేందుకు వస్తున్న అవకాశాలను సీరియస్ గా కొందరు తీసుకోవడం లేదు. లోక్ సభ ఎన్నికల్ని కూడా ఇలానే లైట్ తీసుకున్నారు! ఆశించిన స్థాయిలో ఫలితాలు అనుమానం అని వారే వ్యాఖ్యానిస్తున్నారు. కనీసం, ఇప్పుడైనా… త్వరలో జరగబోయే ఎంపీటీసీ, ఎడ్పీటీసీ ఎన్నికల్లోనైనా సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తే… క్షేత్రస్థాయిలో పార్టీ బలంగానే ఉందనే నమ్మకం పార్టీలో అన్ని వర్గాలకు కలుగుతుంది. కానీ, సీనియర్ నేతలైన వీహెచ్ హన్మంతరావు, జగ్గారెడ్డి లాంటివారు ఆ ఉత్సాహంపై నీళ్లు చల్లే విధంగా ఈ మధ్య వ్యవహరిస్తున్నారు.
తెరాసపై ఒకప్పుడు ఒంటికాలిపై లేచే జగ్గారెడ్డి, ఈ మధ్య కేసీఆర్ పై సద్విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడా డోస్ ను మరికొంత పెంచి… ఆయనకి గుడి కట్టేస్తానని తాజాగా ప్రకటించారు. రైతులు పండించే ప్రతీ గింజకు ఆయన గిట్టుబాటు ధర కల్పిస్తే… సీఎంకి గుడి కడతా అన్నారు. ఈ ప్రకటనలో ఎలాంటి దురుద్దేశం లేదనీ, తెలంగాణ ఇచ్చినందుకు సోనియా, రాహుల్ గాంధీలకు కూడా తలా ఒక గుడి కట్టిస్తానన్నారు. తమకు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు లేకపోయినా క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక, వీహెచ్ ధోరణి ఏంటంటే… పార్టీని నమ్ముకుని ఉంటున్నవారికంటే, డబ్బున్న బడాబాబులకే ప్రాధాన్యత లభిస్తోందని గతవారంలో వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆయన ఏదో ధర్నా కార్యక్రమం చేపడితే…. సొంత పార్టీ నుంచి ఎవ్వరూ రాలేదనీ, మావాళ్లకి అంత తీరికలేదంటూ ఎద్దేవా చేశారు. ఈయన కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందనే అన్నారు.
రైతులకు గిట్టుబాటు ధర కేసీఆర్ తేవాలని జగ్గారెడ్డి అడగడం ఎందుకు? లోక్ సభ ఎన్నికల తరువాత, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పని తామే చేస్తామని చెప్పొచ్చు కదా. అది పార్టీ కేడర్ కి కాస్త వినసొంపుగా ఉంటుంది! ఓపక్క కేసీఆర్ ని పొగుడుతూ… జనాల్లో మాకు బలం ఉందని చెబితే ఎలా ఉంటుంది? జనాల సంగతి తరువాత, జగ్గారెడ్డి వ్యాఖ్యలకి సొంత పార్టీ కేడర్ లోనే మద్దతు లభించదు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా ఏం ఫర్వాలేదంటే ఎలా? వీహెచ్ కూడా అంతే! పార్టీకి ధీటైన నాయకత్వం లేనప్పుడే ఇలా బాహాటంగా వ్యాఖ్యానించేవాళ్లు పెరుగుతుంటారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని దగ్గరపెట్టుకుని, ఇలా వ్యాఖ్యానిస్తూ పార్టీ కేడర్ లో గందరగోళం సృష్టిస్తున్నవారిపై పార్టీ అధినాయకత్వం దృష్టి సారించే పరిస్థితి ఇప్పుడైనా లేదా అనే అనుమానం కలుగుతోంది.