ఇద్దర్ని ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటే.. ఆ రెండు ఎమ్మెల్సీ సీట్లను బీఆర్ఎస్ పోగొట్టుకోవాల్సి వస్తోంది. కనీసం ఒక్కటి అయినా దక్కుతుందని అనుకుంటే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేయడంతో… రెండూ కాంగ్రెస్ ఖాతాలోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు ఎమ్మెల్సీలకు రెండు వేరువేరుగా నోటిఫికేషన్లను గురువారం ఈసీ జారీ చేస్తుంది. . ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. ఈ నెల 29న పోలింగ్, సాయంత్రం ఫలితాలు వెలువడతాయి.
వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేస్తే.. ఒక్కో ఎన్నికకు ఎమ్మెల్యే ఒక్కో సారి ఓటు హక్కు వినియోగించుకుంటారు. రెండు నోటిఫికేషన్లకు రెండు వేర్వేరు ఓటు హక్కులు ఉంటాయి. అంటే ప్రతి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు 119 మంది ఓటర్లు ఉంటారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే ఎమ్మెల్సీ అవుతారు. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీకే రెండు సీట్లు లభిస్తాయి. ఇలా వేర్వేరు నోటిఫికేషన్లు వద్దని బీఆర్ఎస్ నేతలు ఈసీకి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయిది. నిబంధనల ప్రకారం రెండు నోటిఫికేషన్లు ఇస్తున్నట్లుగా స్పష్టం చేశారు.
వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇస్తే పోటీ చేయాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. పోటీ చేస్తే రెండు చోట్ల పోటీ చేయాలి… ఒక్క చోట పోటీ చేసినా ప్రయోజనం ఉండదు. పోటీ చేసిన తర్వాత ఓటు వేయడానికి అందరూ రాకపోతే.. పరువు పోతుంది. అందుకే ఆగిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.