తెలంగాణ సీఎం కేసీఆర్ను.. దళిత అస్త్రంతో ఎదుర్కోవాలని.. కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పిన కేసీఆర్ కనీసం ప్రతిపక్షనేతగా కూడా దళితుణ్నిఅంగీకరించే పరిస్థితిలో లేరన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఆత్మగౌరవ పోరాటం చేయాలని అన్ని పార్టీల్లోని దళిత నేతలను సమీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం.. కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జుగుప్సాకరంగా ఎమ్మెల్యేల ఫిరాయింపులు జరుగుతన్నాయని అఖిలపక్ష నేతలు అంటున్నారు. దళితున్ని సీఎం చేస్తానన్న కేసీఆర్.. దళితుడు ప్రతిపక్ష నేతగా ఉండటానికి కూడా ఇష్టపడటం లేదని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్ కు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే బాద్యత ఉంటుందని ఆయన గుర్తుచేశారు.
భట్టి ప్రతిపక్ష హోదా కోల్పోతే.. కేసీఆర్ పై మాత్రం ఆ మచ్చ శాశ్వతంగా ఉంటుందని సీపీఐ నేత చాడా వెంకట్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలన్న ఉద్దేశంలో కేసీఆర్ ఉన్నారు. అందుకే.. ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే.. ఆ పని పూర్తయిందని.. లాంఛనంగా.. కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదాను రద్దు చేయడమే మిగిలిందంటున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ మినహా అన్ని పక్షాల్లో ఇదే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఫిరాయింపులు వికృతం దాల్చాయని టీజెఎస్ అధ్యక్షులు కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. బలమైన శక్తి కనిపించినప్పుడు ఇప్పుడు పార్టీ మారిన వారు కూడా నీ వెంట ఉండరనే సత్యాన్ని కేసీఆర్ గ్రహించాలని కోదండరాం హితువు పలికారు.
కేసీఆర్ కూడా ఎప్పుడో ఒకప్పుడు ఒంటరి కాకతప్పదని హెచ్చరించారు. ఫిరాయింపుల పై కాంగ్రెస్ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన తాము సంపూర్ణ మద్దతు ఉంటుందని అఖిపక్ష నేతలు హామీ ఇచ్చారు. పార్టీ మారిన నేతల ఇండ్లకు వెళ్లి నిలదీయాలని గద్దర్ సూచిస్తున్నారు. మొత్తానికి ఫిరాయింపులు దళిత ఆత్మగౌరవపోరాటంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.