తమ ఓటమికి ప్రజల కన్నా సోషల్ మీడియాదే ఎక్కువ బాధ్యత అన్నట్లుగా ఎప్పుడు అవకాశం దొరికినా కేటీఆర్ కామెంట్ చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో వెనకబడటం వల్లే ఓడిపోయామన్నది కేటీఆర్ పోస్ట్ మార్టం రిపోర్ట్. అప్పట్లో సహజంగానే పదేళ్ల పాలనా వైఫల్యాలను కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ బాగానే ఎండగట్టింది.
అదే సోషల్ మీడియాలో కాంగ్రెస్ ను వెంటాడుతోంది కేటీఆర్ టీం. కొత్త ఛానెల్స్, కొత్త హ్యాండిల్స్ తో కాంగ్రెస్ అడుగు తీసి అడుగు వేసినా కామెంట్ చేస్తోంది. దీంతో కాంగ్రెస్ తప్పనిసరిగా ప్రతిస్పందించాల్సి వస్తోంది. అదే సమయంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్స్ స్పీడ్ కూడా తగ్గిపోయింది.
కానీ, ఇలా పని కాదని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా సూచించినట్లు తెలుస్తోంది. దీంతో సునీల్ కనుగోల్ టీం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకోవటమే కాదు… ఇక గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసిన తప్పులను మరోసారి ఎత్తి చూపేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికలయ్యాక ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించిన ఆ సంస్థ, ఇప్పుడు మళ్లీ కొత్తగా ఉద్యోగులను తీసుకుంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వింగ్ లోనే ఈ హైరింగ్ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ ఫేక్ కంపెనీలతో అంటూ బీఆర్ఎస్ మూడు రోజులుగా చేస్తున్న ఆరోపణలకు గతంలో మీరు చేసిన ఆరోపణల సంగతేంటీ అంటూ పాత ఒప్పందాలను బయటకు తీస్తోంది. ఇలా అంశం ఏదైనా… విమర్శకు ప్రతి విమర్శతో రెడీగా ఉండేలా సోషల్ మీడియా వింగ్ ను రెడీ చేసింది కాంగ్రెస్. సీఎం సోదరుడి బర్త్ డే ఫోటోల విమర్శలకు గతంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల బర్త్ డే హంగామా వీడియోలతో కౌంటర్ ఇచ్చింది. ఇలా ప్రతి అంశానికి బీఆర్ఎస్ కు కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్.
ఎలాగు అసెంబ్లీ లేదు… ఇక యుద్ధం అంతా సోషల్ మీడియాలోనే కనపడనుంది.