ఆంధ్రా ప్రజలను కించపరిచేట్టు తాను మాట్లాడుతున్నట్టుగా, తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కించపరచినట్టుగా మాట్లాడుతున్నట్టుగా ఒక కథనం ఆంధ్రజ్యోతిలో మాత్రమే ప్రసారమైందనీ, ఇది దుష్ప్రచారం మాత్రమే అంటూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఖండించారు. ఆంధ్రజ్యోతి ఒక కులానికి సంబంధించిన పత్రిక మాత్రమేననీ, ఒక వర్గానికి కొమ్ముకాసేది మాత్రమేనని స్పష్టమౌతోందన్నారు. ఆంధ్రజ్యోతి రాధాక్రిష్ణ గతం తీసుకుంటే.. ఇతనొక కిరోసిన్ దొంగ, రేషన్ సరుకుల దొంగ అని ఆరోపించారు.
ఒక దొంగకి ఇంతకన్నా మంచి ఆలోచనలు వస్తాయా అని ప్రశ్నించారు? దీనిపై ఆయన చర్చలు పెడుతున్నారనీ, అసభ్య పదజాలంతో దూషించడం జరిగిందన్నారు. దీనిపై చట్టపరంగా తాను చర్యలకు దిగుతా అన్నారు. ఆంధ్రజ్యోతిలో ప్రసారమైంది తన గొంతే అని రాధాక్రిష్ణ ప్రూవ్ చెయ్యాలని విజయసాయి డిమాండ్ చేశారు. మీ అందరూ నా వాయిస్ వింటున్నారు, అది నాది కాదనేది మీ అందరికీ తెలుసనీ, ప్రజలందరికీ తెలుసనీ చెప్పారు. టీడీపీ పార్టీకి కొమ్ముకాస్తూ, వారి ప్రయోజనాల కోసమే దీన్ని ప్రసారం చేశారన్నారు. నిన్న లక్ష్మీ పార్వతి మీద దుష్ప్రచారం ప్రారంభించారనీ, ఇవాళ్ల తన మీదన్నారు. రాధాక్రిష్ణ జాతీయ నాయకుడా, దేశభక్తుడా అని ప్రశ్నించారు? ఇక్కడి పోలీసులతోపాటు, ఎన్నికల సంఘం, ఐ అండ్ పి.ఆర్. కి ఫిర్యాదు చేస్తామనీ, ఈ ఛానెల్ మూసేమయని కోరతామన్నారు విజయసాయి.
సెంట్రల్ పోరెన్సిక్ ల్యాబ్ కి ఈ టేపు వెళ్లిన తరువాత ఇది తన వాయిస్ అవునో కాదో తేలిపోతుందన్నారు. తాను ఏరోజు కూడా ఇలా మాట్లాడననీ, ఎవరో ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తితో మాట్లాడించి, దాన్ని తనకు అన్వయించి ఇది ప్రసారం చేశారని తెలుస్తోందన్నారు.
విజయసాయి స్పందన ఇలానే ఉంటుందని ముందుగానే అనుకున్నదే. ఆ వాయిస్ తనది కాదని ఖండించడం, దానిపై చర్యలు తీసుకుంటానని చెప్పడం వరకూ ఓకే. కానీ, ఈ సందర్భంగా రాధాక్రిష్ణ గతం గురించీ విమర్శించడం అప్రస్తుతం కదా. విశాఖలో చంద్రబాబు మాట్లాడుతూ సంక్షేమ పథకాలన్నీ ప్రభుత్వ సొమ్ము నుంచీ ఇస్తున్నావనీ, తన జేబులోంచి పెడుతున్న సొమ్ము కాదనీ చెప్పారనీ… దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే ఈ దుష్ప్రచారమన్నారు. ఇది పూర్తిగా అసంబద్ధమైన వ్యాఖ్యగా ఉంది. ఇది చంద్రబాబు, రాధాక్రిష్ణ చేశారని చెబుతున్నప్పుడు ఆ ఆధారాలేవో కూడా విజయసాయి బయటపెట్టాలి కదా.