రాజ్యసభ ఎంపి సీఎం రమేష్‌పై వరుసగా వివాదాలు బయటకు వస్తున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేశారు. పిసిఎల్ జాయింట్ వెంచర్ కంపెనీకి సంబంధించిన పత్రాలపై సంతకాలు ఫోర్జరీ చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు. వందల కోట్ల రూపాయల పత్రాలు కావడంతో పోలీసులు కేసును హైదరాబాద్ సిసిఎస్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో స్టేట్మెంట్ కోసం కావూరి భాస్కర్‌రావు సిసిఎస్ పోలీసుల ఎదుట శనివారం హాజరయ్యారు.
అరగంట పాటు తన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారని, కంపెనీకి సంబంధించిన సంతకాలు ఫోర్జరీ చేసి సిఎం రమేష్ రూ.450 కోట్లు కొట్టేశాడని కావూరి ఆరోపించారు. దీనికి సంబంధించిన కేసు కోర్టులో ఉందని తెలిపారు. సిబిఐ విచారణ చేస్తే సిఎం రమేష్ వేల కోట్ల స్కాంలు బయటకు వస్తాయని తెలిపారు. మరో వైపు సీఎం రమేష్ .. కాంగ్రెస్, జేడీఎస్ కు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చినట్లుగా బయటపడింది. ఆయన బీజేపీకి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.
దీనిపై బీజేపీ హైకమాండ్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన బీజేపీ తరపున అనకాపల్లి నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయన అవకాశాల్ని దెబ్బతీయడానికే కుట్ర పూరితంగా ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయని అంటున్నారు. వివాదాలు సృష్టించి.. జీవీఎల్ కు టిక్కెట్ ఇప్పించాలన్న ఆలోచన చేస్తున్నారని.. బీజేపీలో చర్చ జరుగతోంది.