ఆంధ్రప్రదేశ్లో సరికొత్త రాజ్యాంగాన్ని పోలీసులు అద్భుతంగా అమలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ నేత సత్యకుమార్ పై జరిగిన దాడిన నిరసనగా చెప్పుకొస్తున్నారు పోలీసులు. అంత స్పష్టంగా దాడులకు పాల్పడిన వీడియోలు ఉంటే స్వయంగా ఎస్పీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. దాడి చేయాలన్న ఉద్దేశంతో కాదని… నిరసన తెలియచేయడానికే రాళ్లేశారని చెప్పుకొచ్చారు. గతంలో అమరావతిలో చంద్రబాబు కారుపై రాళ్ల దాడి చేస్తే… అప్పటి డీజీపీనే అది నిరసన అన్నారు. ఆయన వెళ్లిపోయినా పోలీసులు మాత్రం చట్టాన్ని ఎలా అమలు చేయాలో చక్కగా నేర్చుకున్నారు.
అయితే ఈ రాళ్ల దాడులు.. పార్టీ కార్యాలయాలపై దాడులు అన్నీ వైసీపీ నాయకులకు మాత్రమే ఉండే ప్రజాస్వామ్య స్వేచ్చ. అదే వైసీపీ నేతలలపై ఇతరులు ఎవరైనా ఖాళీ వాటర్ బాటిల్ విసిరినా అది హత్యా నేరమే. నిరసన అనే దానికి అక్కడ అర్థం ఉండదు. విజయనగరంలో ఇలా ఎవరో విజయసాయిరెడ్డి మీద వాటర్ బాటిల్ విసిరితే…. చంద్రబాబు మీద కేసు పెట్టేసే రాజ్యాంగం మన రాష్ట్రంలో అమలవుతోంది. ఇక విశాఖలో రోజా మిడిల్ ఫింగర్ చూపించి రెచ్చగొడితే… జనసైనికులు చెప్పులు విసిరారు. కానీ కేసులు పెట్టింది మాత్రం హత్యయత్నం సెక్షన్లు. ఇలాంటి ఉదంతాలు చెప్పుకోవాలంటే… ఏపీ పోలీసుల సిన్సియార్టీ రెండు పుస్తకాలవుతుంది.
కానీ పోలీసులకు తెలియనిదేమిటంటే.. ప్రజల్లో తమను రక్షించే పోలీసులు బలహీనం అయ్యారని వారికి ఆ సామర్థ్యం లేదన్న ముద్రపడిపోతే మొత్తం అరాచకం ఏర్పడుతుంది. ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయి. తన్నే వాడితే అధికారం అన్నట్లుగా తయారయింది. ఇది ఇంకా కొనసాగుతుంది. ఇలా చేయడం వల్ల నష్టం అధికార పార్టీకో… మరో నేతకో ఉండదు. పవిత్రమైన ఖాకీ యూనిఫాం పెట్టుకుని రాష్ట్రాన్ని కాపాడాల్సిన స్థాయిలో ఉండి.. విఫలమైతే ఆ ప్రభావం మొత్తంగా రాష్ట్రానికి ఉంటుంది. ఎప్పుడు తెలుసుకుంటారో మరి ?