ప్రభుత్వ తీరును ప్రశ్నించే హక్కు ఫోర్త్ ఎస్టేట్ గా పత్రికలకు ఉంటుంది. రాజ్యాంగ విరుద్ధంగా అధికార పార్టీ వ్యవహరిస్తుంటే… నిలదీసి, నిజాలను ప్రజలకు వివరించడం మంచిదే. అయితే, వైకాపా పత్రిక సాక్షి తీరు ఎలా ఉందంటే… వారి పార్టీకి అనుకూలంగా మారుతాయనే అవకాశం ఉన్న అంశాల విషయంలో మాత్రమే ఈ తరహా బాధ్యతను నిర్వహించేందుకు సిద్ధమౌతుంది. రాజ్యంగ పరిధికి లోబడి ప్రభుత్వం పనిచేస్తున్నా… అదేదో సంక్షోభం వైపు వెళ్లిపోతోందనీ, మేధావులు ఆవేదన చెందేస్తున్నారని ఇవాళ్టి పత్రికలో ఓ కథనం రాశారు. రాష్ట్రంలో ఇష్టారాజ్యం అంటూ ఓ స్టోరీ వేశారు. తాజాగా కొంతమంది అధికారుల బదిలీని తప్పుబడుతూ ఎన్నికల సంఘం ఆదేశాలను రాష్ట్రప్రభుత్వం కోర్టులో సవాల్ చేసింది. ఇదేదో ధిక్కారం అన్నట్టుగా సాక్షి రాసింది.
రాజ్యాంగం, కేంద్ర ప్రభుత్వ సంస్థలను లెక్కచేయని విధంగా టీడీపీ వ్యవహరిస్తోందనీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తానను ఆత్మరక్షణలో పడిన ప్రతీసారీ ఇలా వ్యవహరిస్తుంటారని ఆ కథనంలో రాశారు. ఇంటెలిజెన్స్ డీజీని వెనకేసుకొస్తున్నారనీ, రాష్ట్రంలో సీఈసీకి పరిధులు విధిస్తున్నారని చెప్పింది. అంతేకాదు, గతంలో సీబీఐ విషయంలోనూ ఇలానే అడ్డుకునే ప్రయత్నం చేసిందనీ, జగన్ కోడికత్తి కేసు విషయంలో కూడా ఎన్.ఐ.ఎ. విచారణకు అడ్డుపడ్డారనీ రాశారు. అయితే, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్లడమనేది రాజ్యాంగానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యగా సాక్షికి కనిపించలేదు. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలనేది టీడీపీ ప్రభుత్వ నిర్ణయం కాదు. రాజ్యాంగ ప్రకారం రాష్ట్రానికి ఉన్న హక్కునే ఆ సందర్భంలో ప్రభుత్వం ప్రయోగించింది. ఇక, జగన్ కోడి కత్తి కేసులో ఎన్.ఐ.ఎ. విచారణను ఎందుకు ప్రశ్నించాల్సి వచ్చిందంటే… రాష్ట్రస్థాయిలో జరిగిన ఘటనపై ఇక్కడి పోలీసులకు జగన్ సహకరించకుండా, ఇక్కడి సిట్ విచారణ ప్రక్రియకు అడ్డుపడుతూ, కేంద్ర దర్యాప్తు సంస్థే కావాలని వైకాపా పట్టుపట్టింది కాబట్టి.
కేంద్ర ప్రభుత్వం… అంటే మోడీ సర్కారు రాజ్యంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ వ్యవహరించినప్పుడు ఈ సాక్షకి గొంతు ఇంతగా వినిపించలేదే? సీబీఐ విషయంలో కేంద్రం జోక్యం చేసుకున్న తీరు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైతే… అది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసిన పరిస్థితిగా సాక్షికి కనిపించలేదా? ఆర్బీఐ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని, చివరికి ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేసి వెళ్లిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు…అది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసిన పరిస్థితిగా సాక్షికి కనిపించలేదా? రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాల అధికారాలకు కేంద్రం కత్తెర వేస్తుంటే…అది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసిన పరిస్థితిగా సాక్షికి కనిపించలేదా? ఒకవేళ ఏపీ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక మిల్లీ మీటర్ దూరం పక్కకు జరిగినా… ఈపాటికే కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారే చర్యలు అంటూ హడావుడి చేసేది కదా? సాక్షి తీరు ఎలా ఉందంటే… జగన్ కోడి కత్తి కేసు, ఆ పార్టీ కోరినట్టుగా జరిగే బదిలీలను ప్రశ్నించడమే రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసే పరిస్థితులుగా కనిపిస్తున్నాయి, అంతే.