తెలంగాణ గీతం జయజయజయహే.. వివాదాలమయంగా మారింది. అందెశ్రీ రాసిన ఈ గీతాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించి, అధికార హోదా ఇచ్చింది. అంత వరకూ ఎవరికీ ఎలాంటి ఇబ్బందులూ లేవు. కానీ ఈ పాటని స్వర పరిచే బాధ్యత కీరవాణికి అప్పగించడం దగ్గర్నుంచి వివాదాలు మొదలయ్యాయి. కీరవాణి తెలంగాణకు చెందిన సంగీత దర్శకుడు కాదు. అక్కడే అసలు సమస్య. ఓ తెలంగాణ గీతాన్ని, తెలంగాణేతరుడు చేతిలో పెట్టడం ఏమిటని తెలంగాణ వాదులు వాదించారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విమర్శల్ని పట్టించుకోలేదు. కీరవాణి స్వర పరచిన పాటకే రాజముద్ర వేసేసింది. జూన్ 2 నుంచి.. ఈ పాట అధికార గీతంగా చలామణీలోకి వచ్చేసింది.
కీరవాణికి ఈ పాట ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసినవాళ్లంతా ఇప్పుడు, ఈ పాట ట్యూన్ చేసిన విధానంపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ట్యూన్ సరిగా కుదర్లేదని, పాట వినడానికి బాగుంటే సరిపోదని, పాడుకోవడానికీ అనుకూలంగా ఉండాలని, ఆ స్థాయి ఈ పాటకు లేదని తేల్చేశారు. అందెశ్రీ పాట రాసినప్పుడే ఓ ట్యూన్ చేశారని, ఆ ట్యూన్లోనే ఈ పాటని కంపోజ్ చేస్తే బాగుండేదని, ఆ మాత్రందానికి కీరవాణిని తీసుకురావాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు.
తాజాగా అందెశ్రీ రాసిన పాటలోని భావం, వ్యక్తీకరణ విషయంలోనూ ఇప్పుడు వివాదాలు రేగుతున్నాయి. రాష్ట్ర గీతం అంటే పామరులు సైతం పాడుకోవాలని, కానీ.. ఇది పండితులకు మాత్రమే అర్థమయ్యే భాషని వాదిస్తున్నారు. పప్పు నారాయణ చార్య నుంచి కొన్ని లైన్లు ‘జయ జయ ప్రియ భారతి జననీ’ అనే దేవులపల్లి కృష్ణ శాస్త్రి రచించిన గీతం నుంచి ఇంకొన్ని పంక్తులు తీసుకొని కాపీ చేశారని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని పలికించే తెలంగాణ భాషలో ఈ పాటని రచించలేదని ఇంకొంsమంది విమర్శిస్తున్నారు. ”కళల మంజీరాలు, శారత స్వర నాదాలు, పల్లవుల చిరు జల్లుల ప్రతి ఉల్లము రంజిల్లగ” అనే పంక్తులు కూడా అర్థం కాకుండా ఉన్నాయని, ఇది పూర్తిగా పద్య కవుల భాష అని పామరులకు అర్థం కాదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు ఎంత గొంతు చించుకొన్నా లాభం లేదు. రాష్ట్ర భాషగా ‘జయజయహే’కు ఆమోద ముద్ర పడిపోయింది. అయితే ప్రజలు ఈ గీతాన్ని ఎంత వరకూ ఓన్ చేసుకొంటారన్నదే ముందున్న ప్రశ్న.