తెలుగువారికి సంబంధించి ఏకైక మహానటుడు, తెలుగు నేలకు సంబంధించి ఏకైక సంచలనాల రాజకీయనాయకుడు… లాంటి విశేషణాలకు అర్హత కలిగిన ఎన్టీయార్ జీవిత చరిత్ర సినిమాగా రాబోవడం అనేదాన్ని, సినీ, రాజకీయాలకు అతీతంగా చాలా మంది ఆహ్వానిస్తున్నదే. ఈ సినిమా బాలకృష్ణ తీస్తున్నాడనేది తెలిసిందే. అయితే కారణాలేవైనా, ఈ సినిమా స్ఫూర్తిగా, అదే సమయంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ మహానుభావుడి జీవితానికి సంబంధించినవే మరో 2 సినిమాలు సైతం శ్రీకారం చుట్టుకున్నాయి.
మనదేశంలో ఇటీవలి కాలంలో పలు బయోపిక్‌లు తెరకెక్కాయి. హిట్టయినవీ, ఫట్టయినవీ ఉన్నాయి. అలాగే కొండొకచో వివాదస్పదం అయినవీ ఉన్నాయి. అయితే మరే బయోపిక్‌కూ రాని సమస్య ను ఇప్పుడు ఎన్టీయార్ సినిమా ఎదుర్కుంటోంది. తేజ దర్శకత్వంలో బాలకృష్ణ నటించే ఎన్టీయార్ చిత్రం మొదలుకానుండగా, మరోవైపు లక్ష్మీస్ ఎన్టీయార్, లక్ష్మీస్ వీరగ్రంధం కూడా పట్టాలెక్కనున్నాయి.
ఈ రెండు సినిమాలూ ఇప్పుడు బాగా చర్చల్లో నానుతున్నాయి. లక్ష్మీస్ ఎన్టీయార్‌కు రాంగో్పాల్ వర్మ లాంటి రచ్చ ను మెచ్చే దర్శకుడు సూత్రధారి కావడంతో సహజంగానే అది తరచుగా వార్తల్లోకి వస్తోంది. నన్నొకటంటే నిన్ను వందంటా అన్నట్టు కాచుక్కూచునే వర్మ… ట్వీట్ల మీద ట్వీట్లతో ఈ సినిమాను వార్తల్లో నాన్చుతున్నాడు.
మరోవైపు లక్ష్మీస్ వీరగ్రంధం కూడా తానేమీ తీసిపోనన్నట్టు హడావిడి చేస్తోంది. ఒక రోజు లక్ష్మీస్ వీరగ్రంధంకు వ్యతిరేకంగా లక్ష్మీపార్వతి ధర్నా మరో రోజు ఆ సినిమా దర్శకుడు కేతిరెడ్డి లక్ష్మీపార్వతి స్వగ్రామానికి వెళ్లాడని, ఆమె బంధువులను, స్నేహితులను కలిశాడని, వివరాలు సేకరించాడని, మరోసారి వాణి విశ్వనాధ్‌ని లక్ష్మీపార్వతి పాత్రకు ఎంచుకుంటున్నారని… ఇలా ఈ సినిమా రూపకర్తలు కూడా ఏదో ఒక మసాలాను జనంలోకి పంపుతున్నారు.
సోషల్ మీడియాతో సహా అన్ని మాధ్యమాల పుణ్యమాని సహజంగానే ఈ రెండు సినిమాలూ ఇప్పుడు జనం నోళ్లలో బాగా నానుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ సినిమాల షూటింగ్స్ పూర్తి స్థాయిలో ఊపందుకుంటే… మరింత ప్రచారం కూడా రాజుకోవడం తధ్యం. మరి వీటి హడావిడి మధ్యలో ఎటువంటి మషాలా లేకుండా తెరకెక్కుతున్న బాలకృష్ణ తీసే ఎన్టీయార్ సినిమా… తనకు దక్కాల్సినంత గుర్తింపు దక్కించుకుంటుందా అనేది సందేహాస్పదంగానే కనిపిస్తోంది.