కథానాయకుడిని తలదన్నే ఫ్లాప్ మహానాయకుడు మూట గట్టుకుంది. ఈ రెండు ప్రాజెక్టులతో ఎవరెవరు ఎంతెంత నష్టపోయారన్న లెక్కలు ఇప్పుడిప్పుడే తేలుతోంది. ఈ పరాజయాల్ని చిత్రబృందం కూడా ఒప్పుకుంటోంది. ఈ పరాభవ భారం నుంచి అభిమానులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. అయితే… చిత్రబృందం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల… ‘ఎన్టీఆర్’ బయోపిక్ పరువు మరింతగా దిగజారిపోతోందేమో అనిపిస్తోంది.
ఈ సినిమాని డ్వాక్రా మహిళల కోసం ఉచితంగా ప్రదర్శించాలన్నది తాజా నిర్ణయం. వాళ్లతో థియేటర్లు నింపి.. ఓ రకంగా సంతృప్తి పడాలనుకోవడం విచిత్రంగా తోస్తోంది. ఇదంతా డ్వాక్రా మహిళలపై ప్రేమా? లేదంటే థియేటర్లలో జనం లేరన్న ఆవేదనా? లేదంటే.. ఈ సినిమాని టీడీపీ ప్రచార సాధనంగా మార్చుకోవాలన్న ఆలోచనా..? అనే ప్రశ్నలకు తావులేదు. కేవలం… టీడీపీ ప్రచార సాధనమే అన్నది ముమ్మాటికీ నిజం. ఇలా ఫ్రీగా టికెట్లు ఇచ్చి… జనాన్ని రప్పించడం, వచ్చిన వాళ్లకు కూల్ డ్రింకులు, సమోసాలు అందించడం… సీ క్లాసు సినిమాలు పాటించే పద్ధతి. కొడుకుని హీరోగా చూడాలన్న కాంక్షతో తండ్రులే సినిమాలు తీసి, చివరికి జనాలు లేకపోవడంతో, ఎదురు డబ్బులిచ్చి మరీ జనాల్ని థియేటర్లకు తరలించిన వైనం గురించి చాలా జోకులు పేలాయి. ఇప్పుడు వాటిలో ఎన్టీఆర్ ఒకటిగా మిగిలిపోతుండడం బాధాకరం.
ఇప్పుడు బాలకృష్ణ చేయాల్సింది ఒక్కడే. ఈ ఓటమిని గౌరవంగా ఒప్పుకోవడం. వినయ విధేయ రామ ఫ్లాప్ అయ్యిందని రామ్ చరణ్ ఎలా ఒప్పుకున్నాడో అలా అన్నమాట. బాలయ్య చేయాల్సిన మరో పని కూడా ఉంది. అదేంటంటే.. ఈ సినిమాని నమ్మి, భారీ రేట్లకు కొని మోసపోయిన బయ్యర్లని ఆదుకోవడం. తొలి సినిమా ఫ్లాప్ అయ్యాక… 33 శాతం తిరిగి ఇచ్చిన బాలయ్య.. ఇప్పుడు కూడా అంతే పెద్ద మనసుతో తమని ఆదుకుంటాడని వాళ్లంతా గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు. కాకపోతే.. ఇప్పుడు ఇంకాస్త తొందరగా స్పందించాల్సిన అవసరం ఉంది.