డీజే పాట వివాదాల్లో ఇరుక్కొన్న సంగతి తెలిసిందే. `గుడిలో బడిలో ఒడిలో మడిలో` పాటలోని కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ బ్రాహ్మణ సంఘాలు ఆరోపించడం.. `వాటిని తొలగిస్తాం` అని దర్శక నిర్మాతలు హమీ ఇవ్వడం తెలిసిన సంగతులే. అయితే.. డీజే ఆడియో బయటకు వచ్చేసింది. బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం చెప్పిన పదాలేవీ తొలగించలేదు. దానికి తోడు.. ఆడియో వేడుకపై కూడా తనని తాను సమర్థించుకొంటున్నట్టే మాట్లాడాడు హరీష్ శంకర్. దాంతో బ్రాహ్మణ సంఘాలు మళ్లీ రివర్స్ అవుతున్నాయి. `పాటలోని నమకం చమకం అనే పదాలు తొలగించకపోతే.. ఊరుకోం. పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహిస్తాం. సినిమా విడుదల కాకుండా అడ్డుకొంటాం` అంటూ హెచ్చరికలు జారీ చేశాయి. దాంతో హరీష్ శంకర్ వివరణ ఇచ్చుకోవాల్సివచ్చింది. ”పాటలోని పదాల్ని తప్పకుండా తొలగిస్తాం. అయితే… సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చాక… పాట మారుస్తారు. అంత వరకూ ఓపిక పట్టండి” అని విన్నవించుకొన్నారు. వాట్సప్ మెసేజీలతో పెద్ద పెద్ద వ్యవహారాలు సద్దుమణుగుతున్న కాలం ఇది. రెండు పదాలు తొలగించడానికి, ఆ ప్లేసులో కొత్త పదాలు పేర్చడానికి మరీ ఇంత టైమా??
ఈలోగా సెన్సార్ కూడా అయిపోతుంది. సెన్సార్ నుంచి క్లియరెన్స్ వచ్చేస్తే తరవాత ఎంత అరచి గోల పెట్టినా లాభం ఉండదు. బహుశా… హరీష్ అండ్ టీమ్ ఆలోచన కూడా అదేనేమో..??