ఈరోజుల్లో చిన్న సినిమానైనా క్వాలిటీగా తీయాల్సిందే. అందులో ఏమాత్రం తేడా వచ్చినా చీప్ లుక్ వచ్చేస్తుంది. పాన్ ఇండియా స్థాయి సినిమాలు చూసిన ప్రేక్షకుల కళ్లకు ఏమాత్రం ఆనకుండా పోతాయి. అందుకే మేకింగ్ విషయంలో నిర్మాతలు రాజీ పడడం లేదు. గీతా ఆర్ట్స్ 2 లాంటి సంస్థలైతే బడ్జెట్ గురించి పెద్దగా బెంగ పడవు. ఎందుకంటే ఎంత ఖర్చు పెట్టినా తిరిగి రాబట్టుకోగలం అనే నమ్మకం ఉంటుంది. ‘ఆయ్’ సినిమా కోసం కూడా అలాగే ఖర్చు పెట్టారు. నార్ని నితిన్ హీరోగా నటించిన సినిమా ఇది. బన్నీ వాస్ నిర్మాత. ఆగస్టు 15న విడుదల అవుతుంది. గోదావరి జిల్లాల నేపధ్యంలో సాగే కథ ఇది. చిన్న సినిమా అయినా బాగా ఖర్చు పెట్టారట. కేవలం వర్షం కోసమే కోటి రూపాయలు అయ్యాయని అల్లు అరవింద్ చెబుతున్నారు.
పూర్తిగా వర్షాకాలంలో తీయాల్సిన సినిమా ఇది. అయితే డేట్లు కుదరక, షూటింగ్ ఎండాకాలం మొదలెట్టారు.రైన్ ఎఫెక్ట్ కోసం ట్యాంకర్లు బాగా వాడార్ట. వాటికైన ఖర్చు కోటి రూపాయలట. ఈ విషయాన్ని అరవింద్ స్వయంగా చెప్పారు. రైనీ ఎఫెక్ట్ కోసం చాలా కష్టపడ్డామని, అందుకే షూటింగ్ డేస్ కూడా పెరిగాయని, అయితే అవుట్ పుట్ మాత్రం బాగా వచ్చిందని, సినిమా చూస్తుంటే థియేటర్లో వర్షం పడుతున్న ఫీలింగ్ వచ్చిందని బన్నీ వాస్ అన్నారు. నిజంగానే విజువల్స్ బాగా వచ్చాయి. కోనసీమ అందాల్ని బాగా ఒడిసిపట్టుకొన్న ఫీలింగ్ కలిగింది. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అదే రోజున ‘పుష్ష 2’ రావాల్సివుంది. ఆ సినిమా డిసెంబరుకి వాయిదా పడడంతో.. ఆ గ్యాప్‌ని ‘ఆయ్’ ఇలా వాడుకొంది.