ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాల ట్రెండ్స్ లో ఫలితాల స్వరూపం కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ హవా ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమైందని అనుకోవచ్చు. గోవాలో మాత్రం హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. బీజేపీకి ఎలా అధికారం చేపట్టాలో తెలుసు.
యూపీలో బీజేపీ హవా ఏ మాత్రం తగ్గలేదు !
ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మరోసారి విజయం సాధించడం ఖాయమైంది. మొత్తం 403 స్థానాలుంటే వాటిలో కనీసం 250 చోట్ల విజయం సాధించడం ఖాయమయింది. ఎస్పీ కనీసం నూట యాభై స్థానాలు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి కానీ అలాంటిదేమీ లేదని తేలిపోయింది. వంద స్థానాలు చేరుకోవడమే కష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అసలు అడ్రస్ లేదు.
పంజాబ్‌ను ఊడ్చేస్తున్న ఆమ్ ఆద్మీ !
ఇక పంజాబ్ ఎన్నికల్లో ఈ సారి కొత్త చరిత్ర ప్రారంభమయింది. కాంగ్రెస్, అకాలీదళ్ మద్య మారుతున్న అధికారం ఈసారి ఆప్ పంచకు చేరింది. ఆ పార్టీ అతి భారీ విజయాన్ని దక్కించుకుంది. 117 అసెంబ్లీ స్థానాల్లో 80కిపైగా ఆప్ గెల్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ విజయం సాధించారు. సిద్ధూతో పాటు చన్నీ కూడా వెనుకబడినట్లుగా తెలుస్తోంది.
ఉత్తరాఖండ్‌లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం !
చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ఉత్తరాఖండ్‌లో బీజేపీ గెలుస్తుందని అంచనా వేయలేదు. టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పారు. కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కూడా చెప్పాయి. కానీ ఉత్తరాఖండ్‌లో మూడింట రెండువందల మెజార్టీని బీజేపీ సాధించే దిశగా వెళ్తోంది. అక్కడ ముగ్గురు సీఎంలను మార్చినా బీజేపీకే అధికారం దఖలు పడింది.
గోవాలో హంగ్.. కానీ బీజేపీకే చాన్స్ !
గోవాలో ఎప్పట్లాగే హంగ్ అసెంబ్లీ ఖాయంగా కనిపిస్తోంది. అక్కడ ఉన్న 40 అసెంబ్లీ స్థానాల్లో పదిహేడు బీజేపీకి… పదమూడు కాంగ్రెస్‌కు వచ్చే అకాశాలు ఉన్నాయి. ఇతరులు పది చోట్ల గెలిచే చాన్స్ ఉంది. వారే కింగ్ మేకర్లు. వారిని ఎలా దారికి తెచ్చుకోవాలో బీజేపీకి బాగా తెలుసు కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమనుకోవచ్చు.
మణిపూర్‌లోనూ బీజేపీకి ఆధిక్యం !
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఏటికి ఎదురీది బీజేపీ ముందడుగు వేసింది. పూర్తి మెజార్టీ సాధించలేకపోయినా.. అతి పెద్ద పార్టీగా నిలిచింది. మణిపూర్‌లో ఉన్న మొత్తం అరవై స్థానాల్లో పాతిక సీట్లలో బీజేపీ విజయం సాధించే అవకాశం ఉంది. అతి పెద్ద పార్టీగా అవతరిస్తే.. ప్రభుత్వం ఏర్పాటు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అనుకోవచ్చు.
మొత్తం ఎన్నికల్లో అధికారంలో ఉన్న పంజాబ్‌ను కాంగ్రెస్ పోగొట్టుకుంది. చాన్సులు ఉన్నాయనుకున్న ఉత్తరాఖండ్‌లో గెలవలేదు. ఇతర చోట్ల కాస్త ఉనికి కాపాడుకుంది.