చంద్రబాబుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ సమయంలో చంద్రబాబు వెంట ఇద్దరు డీఎస్పీలు ఉండాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. అదనపు షరతులు విధించాలన్న సీఐడీ విజ్ఞప్తిని పాక్షికంగానే అనుమతించింది. స్కిల్ కేసుపై మీడియాతో మాట్లాడవద్దని చంద్రబాబును ఆదేశించింది. ఇతర అంశాలపై మీడియాతో మాట్లాడటానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే రాజకీయ ర్యాలీల్లో పాల్గొనవద్దని ఆదేశించింది. ఇతర ఆంక్షలను విధించడానికి నిరాకరించింది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ చంద్రబాబునాయుడిని ఈ ఏడాది సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు. ఆరోగ్య కారణాలతో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మధ్యంతర బెయిల్ ఇచ్చే సమయంలో మరో ఐదు షరతులను జత చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్పోజ్ చేసింది. చంద్రబాబుపై వరుస కేసులు పెడుతున్న సీఐడీ ఆయన బయటకు రావడాన్ని జీర్ణించుకోలేకపోయింది.
చంద్రబాబు బయట ఉన్నా.. ఆయనను తమ గుప్పిట్లోనే ఉంచుకోవాలన్నట్లుగా ఆయన వెంట ఎప్పుడూ ఇద్దరు డీఎస్పీలు ఉండాలని.. కోర్టుకెళ్లింది. న్యాయమూర్తితోనే ఏఏజీ వాదనలు దిగడంతో.. మొదటే హైకోర్టు ధర్మాసనం.. తీర్పు అంగీకారం కాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లాలి కానీ.. మీరు చెప్పినట్లే తీర్పు ఇవ్వాలనడం సరి కాదని మండిపడింది.