కేసీఆర్ ఫ్యామిలీకి వరుస షాకులు తగులుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిని నిగ్గు తేల్చాలంటూ దాఖలైన పిటిషన్ లో భాగంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ , మాజీ మంత్రి హరీష్ రావుతోపాటు మరికొంతమందికి భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లాకు చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో కేసీఆర్ , హరీష్ రావుతోపాటు ఈ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ అధినేత మేఘాకృష్ణారెడ్డి, ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్ , సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ , ఈ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మేఘా కృష్ణారెడ్డి, ఇరిగేషన్ ఇంజినీర్ – ఇన్ – చీఫ్ హరిరాం, చీఫ్ ఇంజినీర్ శ్రీధర్ లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ కేసులో కోర్టు కేసీఆర్ , హరీష్ రావుతోపాటు మరో ఆరుగురికి నోటీసులు ఇచ్చింది. వచ్చే నెల ఐదున కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.
Also Read: బీఎల్ సంతోష్ వచ్చేశాడు.. బీఆర్ఎస్ లో ఆందోళన!
కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ కుంగడంతో రాజలింగమూర్తి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఈ విషయమై కేసు నమోదు చేయాలని ఎస్పీ, డీజీపీతో సహా ఎవరికి ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని జిల్లా కోర్టును ఆశ్రయించాడు.
సరైన ఆధారాలు లేవని జిల్లా కోర్ట్ ఈ పిటిషన్ ను కొట్టివేయగా.. తర్వాత హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు సూచనల మేరకు మళ్లీ జిల్లా కోర్టులో అన్ని ఆధారాలతో పిటిషన్ దాఖలు చేశారు రాజలింగమూర్తి. దీంతో జిల్లా కోర్టు సెప్టెంబర్ 5న ఈ కేసులో కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశించడంతో కేసీఆర్ , హరీష్ రావులు హాజరు అవుతారా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది.