ఆంధ్రప్రదేశ్ సచివాలయం కరోనా గుప్పిట్లో చిక్కుకుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం పేషీలో పని చేసే ఓ అధికారి డ్రైవర్‌కు కూడా కరోనా నిర్ధారణ అయింది. మొత్తంగా ఇప్పటి వరకూ పది మంది సచివాలయ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిన్న ఒక్కరోజే.. ఐదుగురికి వైరస్ సోకినట్లుగా తేలింది. ప్రధానమైన విభాగాల్లో పని చేసేవారు కావడంతో.. ఉద్యోగులు టెన్షన్‌కు గురవుతున్నారు. ఇప్పటి వరకూ పది మంది ఉద్యోగులకు పాజిటివ్ వచ్చింది. లాక్డౌన్ 4.0 నుంచి.. ప్రభుత్వ కార్యాలయాల్లో వంద శాతం హాజరు ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. వర్క్ ఫ్రం హోం వెసులుబాటు ఉన్న వారు కూడా.. ఆఫీసులకు రావాలని హెచ్వోడీలు ఆదేశాలిచ్చారు.
హైదరాబాద్‌లో ఇరుక్కుపోయిన ఉద్యోగులకు.. తెలంగాణ సర్కార్ పర్మిషన్ తీసుకుని ప్రత్యేకంగా బస్సులు వేశారు. ఇలా హైదరాబాద్ నుంచి వచ్చిన వారిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారి ద్వారా వచ్చిందో.. మరో విధంగా సోకిందో కానీ.. మరో ఐదు మందికి లెక్క తేలింది. ఇప్పటికే తమ శాఖలోని ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో.. వ్యవసాయశాఖ ఉన్నతాధికారి పూనం మాలకొండయ్య.. తమ శాఖ ఉద్యోగులకు రెండు వారాల పాటు వర్క్ ఫ్రం హోం ప్రకటించారు. ఇప్పటికిప్పుడు… సచివాలాయాన్ని శానిటైజ్ చేసి.. మళ్లీ విధి నిర్వహణకు సిద్ధం చేస్తున్నారు.
మరికొంత మంది ఉద్యోగుల టెస్టుల వివరాలు రావాల్సి ఉంది. ఇదే విధంగా కరోనా కేసులు పెరిగితే… సచివాలయాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించాల్సి వస్తుందన్న ఆందోళన అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే ఐసీఎంఆర్ నిబంధనల సడలింపు ఇవ్వడంతో.. సచివాలయం మూసివేయడం లాంటివేమీ ఉండవని అంటున్నారు.