కరోనా కొత్త వేరియంట్ పేరుతో హడావుడి ప్రారంభమైంది. కేరళలో జేఎన్.1 వేరియంట్ నమోదయిందని తెలియగానే దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని అలర్ట్ గా ఉండాలని కేంద్రం హడావుడి ప్రారంభించింది. కొత్తగా రాష్ట్రాలు అడ్వయిజరీలు జారీ చేస్తున్నాయి. మాస్కులు మళ్లీ బయటకు తీయాలని సూచిస్తున్నాయి. శానిటైజర్లు.. ఆంక్షలు కామన్ అవబోతున్నారు. దీనంతటికి కారణం కొత్త వైరస్ విస్తరణపై భయమే. నిజానికి కరోనా ను ప్రజలు మర్చిపోతున్నారు. ఓ పీడకలగా భావిస్తున్నారు.
కరోనా లక్షణాలు పూర్తిగా జలుబు, దగ్గులే కావడం.. కరోనా ప్రత్యేక చికిత్స లేకపోవడంతో టెస్టులు కూడా చేయించుకోకుండా.. మామూలు మెడికేషన్ కొనసాగిస్తున్నారు. ఎవరికి వస్తుందో.. ఎవరికి తగ్గిపోతుందో తెలియడం లేదు. కానీ.. ఇప్పుడు కొత్త వేరియంట్ ప్రభావం పెరుగుతూండటంతో.. మళ్లీ గందరగోళం ప్రారంభమవుతోంది. నిపుణుల పేరుతో కొత్త వేరియంట్ ఎంత భయంకరమైనదో చెప్పి భయపెట్టేందుకు కొంత మంది నిపుణులు రంగంలోకి దిగిపోయారు.
నిజానికి కరోనా వేరియంట్స్…. భయం పై ఎన్ని సార్లు ఇలాంటి అప్రమత్తతలు చెప్పారో లెక్కే లేదు. కానీ అప్రమత్తత పేరుతో భయాన్ని ప్రజల్లో నింపుతూండటంతో ఎక్కువ అనర్థాలు జరుగుతున్నాయి. కరోనా పేరుతో ప్రజల్లోకి పంపే పానిక్.. అన్ని రకాల సమస్యలకు కారణం అవుతోంది. అన్ని వ్యాక్సిన్లు పని చేస్తాయని చెబుతున్నారు. దాదాపుగా అందరూ వ్యాక్సిన్లు వేసుకున్నారు . ఇలాంటి సమయంలో కొత్త కరోనా వేరియంట్ పేరుతో బయపెట్టడం కన్నా వ్యూహాత్మక చర్యలు తీసుకోవడంపైనే ప్రభుత్వ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది