సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న ఏచూరి కాసేపటి క్రితమే కన్నుమూసినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి.
ఆగస్ట్ 19న ఢిల్లీ ఎయిమ్స్ లో ఎమర్జెన్సీ వార్డులో సీతారాం ఏచూరిని ఆయన కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇంటెన్సివ్ కేర్ కు మార్చారు. తాజాగా ఏచూరి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో కన్నుమూశారు.
బాల్యం – విద్యాభ్యాసం
1952 ఆగస్టు 12చెన్నైలో జన్మించారు ఏచూరి. ఆయన బాల్యమంతా హైదరాబాద్ లోనే గడిచింది. ఇక్కడి ఆల్ సెయింట్స్ హైస్కూల్ లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన ఏచూరి..సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ లో ఎకనామిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రతిష్టాత్మకమైన జేఎన్యూ నుంచి మాస్టర్ డిగ్రీ పొందిన అనంతరం.. అదే వర్సిటీ పరిశోధన విద్య కోసం చేరినా.. ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ కావడం వలన పీహెచ్డీని కొనసాగించలేకపోయారు.
రాజకీయ ప్రస్థానం
సీపీఎం అనుబంధ విద్యార్ధి సంఘంలో 17974లో చేరిన ఏచూరి అక్కడి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. జేఎన్యూ విద్యార్ధి సంఘం ఎన్నికల్లో మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ప్రభావంతోనే జేఎన్యూ వామపక్ష కేంద్రంగా మారిందని ఇప్పటికీ అంటుంటారు.
1984లో సీపీఎం కేంద్ర కమిటీలో చేరి.. 1992లో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2005లో వెస్ట్ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనా ఏచూరి అప్పటి నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు.