శీర్షిక చూసి, ఇదేదో సక్సెస్ స్టోరీ అనుకుంటున్నారా. కానే కాదు. ఈ దేశంలో రాజకీయ సంబంధాలను ఉపయోగించుకుని, అర్హత లేకుండానే అత్యున్నత స్థానానికి ఎదిగిపోవడం ఆశ్చర్యమూ కాదు.. అసాధారణమూ కాదు అని ఈ ఉదంతం నిరూపిస్తోంది.
స్మశానాల్లో అంత్యక్రియలను నిర్వహించే ఉద్యోగి ఎగ్జిక్యూటివ్ ఇంజినీరయ్యాడు. ఇది నిజం. దీనికి కారణం అతని ప్రతిభై ఉంటే ఎవరూ తప్పు పట్టరు. అభ్యంతరమూ ఉండదు. అతను చదివింది. ఐటిఐ..ఐటీఐ చదివిన వ్యక్తికి ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుగా ప్రమోషన్ ఎలా ఇస్తారని సమాచార హక్కు కార్యకర్త ఒకరికి అనుమానమొచ్చింది. దరఖాస్తులో వెల్లడైన అంశాలు సమాజాన్ని దిగ్భ్రమ చెందేలా ఉన్నాయి. 1987 సంవత్సంలో మహేష్ అనే వ్యక్తి మైసూర్ సిటీ కార్పొరేషన్లో క్రిమేటోరియమ్ ఆపరేటర్‌గా చేరాడు. హుబ్బలిలో ఇప్పుడతను ఓ విభాగానికి అధిపతిగా మారాడు. మామూలుగా చూస్తే మహేష్‌ది ఒక సక్సెస్ స్టోరీగా నెత్తికెత్తుకోవాలి. ఐటీఐలో ఎలక్ట్రికల్ కోర్సు చేసిన అతనికి 1996లో జూనియర్ ఇంజినీర్‌గా పదోన్నతి లభించింది. ఇది అడ్డదారిలో వచ్చిందని కొంతమంది నిరూపించడానికి చేసిన ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి. 2006-07లో మరో ప్రమోషన్ లభించింది. ఈ కేసును ముందు నుంచి పరిశీలిస్తున్న బసవరాజు అనే సమాచార హక్కు కార్యకర్త మహేశ్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, రిటైరవుతున్న ఓ ఇంజినీర్ స్థానాన్ని సంపాదించాడని పేర్కొన్నాడు. ఐటిఐ సర్టిఫికెట్తో ఇంజినీరింగ్ ప్రమోషన్ ఇవ్వకూడదని తెలిపారు. కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాలతో మహేష్ ప్రమోషన్‌ను ఉపసంహరించుకున్నారు. మహేష్ తిరిగి తన రాజకీయ సంబంధాలను ఉపయోగించుకోవడమే కాకుండా.. కోర్టునూ అశ్రయించాడు. మహేశ్ వాదననూ పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. దీన్ని ఆధారంగా చేసుకుని, తన ప్రమోషన్ తనకివ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశాడు. అతనికి మద్దతుగా ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు రాయడం ప్రాంభించారు. ఎమ్మెల్యే సిఎస్ పుట్టరాజు, మాజీ ఎమ్మెల్యే కృష్ణ అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖ రాశారు. దీనిపై కుమారస్వామి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అభిప్రాయం కోరారు. ఐటీఐ హోల్డర్లకు ప్రమోషన్లు ఇవ్వకూడదని ఆ విభాగం తన అభిప్రాయాన్ని తెలియజేసింది. దీనికి 1961లో ఐటీఐ, డిప్లమో కోర్సులు సమానమేనంటూ ఇచ్చిన ఓ ఆదేశాన్ని సాకుగా చూపి, మహేశ్‌కు తిరిగి ప్రమోషన్ ఇచ్చారు. బసవరాజు మళ్ళీ లేఖ రాయడంతో తన ప్రమోషన్ ఉపసంహరించకుండా హైకోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నారు. అక్రమ పద్ధతుల్లో తాను ప్రమోషన్ తెచ్చుకున్నానని ఎలా చెప్పగలరంటూ మహేశ్ ప్రశ్నిస్తున్నాడు. నాకు పదోన్నతి ఇచ్చింది ప్రభుత్వం.. వెళ్ళి దాన్ని అడగండి.. నన్నెందుకు అడుగుతున్నారంటూ నిలదీశాడు.
అర్హత లేని వ్యక్తికి పదోన్నతి కల్పిస్తే అతను సమర్థంగా పనిచేయగలడా అనేది కొందరి ఆందోళన. ఇదే కొనసాగితే అతను మరింత పెద్ద పోస్టుకు వెళ్లవచ్చు. ఒక రోడ్డు గురించి, లేదా మరో పనిగురించి అతనికి అవగాహనే లేదు. అతను నాణ్యతను ఎలా కొనసాగించగలడని ప్రశ్నిస్తున్నారు. అడ్వొకేట్ కూడా అయిన డాక్టర్ చిదానంద సరికర్ అనే సమాచార హక్కు కార్యకర్త కూడా మహేశ్ వ్యవహారం గురించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. బెంగళూరు మిర్రర్ ఈ కథనాన్ని ప్రచురించింది.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి