ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ చార్జీలను ట్రూ అప్ అనే కొత్త పద్దతితో బాదుడు ప్రారంభించారు. బిల్లులో ట్రూ అప్అనే సెక్షన్ కింద యూనిట్‌కు రూ.1.23 పైసలు వడ్డించడం ప్రారంభించారు.అంటే వంద యూనిట్లు వాడితే రూ. 123 అదనంగా వస్తుందన్నమాట. ఈ బిల్లులు చూసి వినియోగదారుల చెవుల్లో ఒక్కటే వినిపిస్తోంది. ” కరెంట్ చార్జీలను పూర్తిగా తగ్గించేస్తా ” అని ప్రమాణస్వీకార వేదిక మీద నుంచి రెండు చేతుల్ని అడ్డంగా తిప్పుతూ కరెంట్ చార్జీల భారాన్ని ఖతం చేస్తా అన్నట్లుగా ఆయన చేసిన ప్రకటన కళ్ల ముందుకు వస్తోంది.
గత ఆరేళ్ల కాలంలో విద్యుత్ సంస్థలు అంచనా కన్నా ఎక్కువ ఖర్చుచేశాయని ఆ మొత్తాన్ని ప్రజల వద్ద పిండుకునే విధానమే ట్రూ అప్. ట్రూ అప్ చార్జీల కింద 8 నెలల్లో రూ.3,660 కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ నెల నుంచే వసూలు ప్రారంభించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఈ ట్రూ అప్ నివేదికలను ఈఆర్సీ వద్ద దాఖలు చేయవద్దని ప్రజలపై భారం వద్దని… విద్యుత్ సంస్థలకు ఏవైనా అదనపు ఖర్చులు వస్తే ప్రభుత్వపరంగా భరించాలని విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా విద్యుత్ సంస్థలు అప్పట్లో ఈ నివేదికలు దాఖలు చేయలేదు. అందుకే గత ప్రభుత్వాల హయాంలో ఈ చార్జీలు వేయలేదు.
అయితే ఇదే అవకాశంగా తీసుకున్న ప్రస్తుత ప్రభుత్వం ఆ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించుకుంది. కారణం కూడా గత ప్రభుత్వంపైనే నెడుతోంది. అప్పటి ప్రభుత్వం ట్రూ అప్ సర్దుబాటు కోసం నిధులేవీ ఇవ్వలేదని అందుకే ప్రజల దగ్గర వసూలు చేస్తున్నామని చెబుతోంది. మొత్తానికి విద్యుత్ చార్జీలు పూర్తిగా తగ్గిస్తామనే దగ్గర్నుంచి గత ప్రభుత్వం వసూలు చేయని ట్రూ అప్ చార్జీలు కూడా ఆదాయం కూడా వసూలు చేసే స్థాయికి విద్యుత్ వ్యవస్థ దిగజారిపోయిదని ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది.