కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు కుటుంబీకులకు చెందిన స్వర్ణా బార్ అండ్ రెస్టారెంట్ లో అమ్మబడిన కల్తీ మద్యంలో అత్యంత ప్రమాదకరమయిన పొటాషియం సైనేడ్ అనే విష పదార్ధం కలుపబడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాధమికంగా నిర్ధారణ చేసింది. కానీ దీనిని మళ్ళీ నిర్ధారించుకొనేందుకు స్వర్ణా బార్ అండ్ రెస్టారెంట్ లో నుండి సేకరించిన మద్యం నమూనాలను హైదరాబాద్ లోని కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. అది కూడా పొటాషియం సైనేడ్ కలిసినట్లు నిర్ధారణ చేసినట్లయితే ఇది సాధారణ కల్తీ మద్యం కేసు కాదని, మల్లాది విష్ణు యొక్క వ్యాపార లేదా రాజకీయ శత్రువులు ఎవరో ఆయనను దెబ్బ తీసేందుకు కావాలనే చేసిన కుట్ర అని అనుమానించవలసి ఉంటుంది.
డిశంబర్ 8వ తేదీన కృష్ణలంకలో మల్లాది విష్ణు కుటుంబీకులకు చెందిన స్వర్ణా బార్ అండ్ రెస్టారెంట్ లో కల్తీ మద్యం త్రాగి ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఎక్సయిజ్ శాఖ అధికారులు స్వర్ణా బార్ అండ్ రెస్టారెంట్ లో సరఫరా అవుతున్న మద్యం నమూనాలను సేకరించి బార్ ని మూసివేశారు. సాధారణంగా కల్తీ మద్యం అనగానే అందులో మిథైల్ ఆల్కహాల్ కలిసి ఉండవచ్చని అనుమానిస్తారు. కానీ దీనిలో భయంకరమయిన సైనేడ్ విషపదార్ధం కనుగొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మల్లాది విష్ణుతో సహా అనేకమందిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన ఈ తాజా నివేదిక ఈ కేసును కొత్త మలుపు తిప్పే అవకాశం కనబడుతోంది.