అప్పుడెప్పుడో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. కోట్లు కొట్టేయడానికి దర్జాగా కోల్‌కతా సూట్ కేస్ కంపెనీల పేరుతో చెక్‌లు జమ చేశారు. ఆ కేసు ఇంత వరకూ తేలలేదు. కానీ ఇప్పుడు ఏకంగా సీఎం జగన్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. జగన్ పీఏ నాగేశ్వర్ రెడ్డి పేరుతో ఐడీ క్రియేట్ చేసుకుని అందరూ నమ్మేలా చేస్తూ కొంత మంది ఈ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మణిపాల్ ఆస్పత్రి యజమానికి టోకరా వేయబోయారు. ఆయనకు డౌట్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే అలా చేయడం మొదటి సారి కాదని ఇప్పటికే పలువుర్ని మోసం చేశారని బయట పడింది. తాజాగా బర్జర్ పెయింట్స్ నుంచి పదిన్నర లక్షలు నొక్కేశారు. సీఎం జగన్ దావోస్‌లో ఉన్న సమయంలో ఆయన పేరుతో ఇక్కడ ఫ్రాడ్‌కు పాల్పడ్డారు. రూ. పది లక్షలు ఓ సూట్ కేస్ కంపెనీకి తరలించారు. ఇంత జరుగుతున్నా పోలీసులకు… ఎవరికీ తెలియదు. బర్జర్ పెయింట్స్ వాళ్లు వచ్చి చెబితేనే తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా .. సీఎంవో సిబ్బంది నింపాదిగా స్పందించారు. పోలీసులకు ఫిర్యాదు చేయమన్నారు.
అసలు జగన్ పేరుతో మోసాలు చేయాలనే ఆలోచన రావడం ..దాన్ని అమల్లో పెట్టడం .. పోలీసులు సీరియస్‌గా తీసుకోకపోవడం వ్యవస్థలో పేరుకుపోయిన జడత్వానికి కారణం అనుకోవచ్చు. ఓ సీఎం పేరును ఇంత విచ్చలవిడిగా వాడేసి అందర్నీ భయపెట్టేసి డబ్బులు వసూలు చేస్తూంటే.. ఇంటలిజెన్స్ వ్యవస్థ ఏమైపోయి ఉంటుంది? ఇలాంటి పరిస్థితి రావడం ముఖ్యమంత్రికి కూడా తలవంపులులాంటిదే.