ఆంధ్రప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం అందర్నీ ఆకర్షించే నియోజకవర్గాల్లో ఒకటిగా పర్చూరు నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ నియోజకవర్గం నుంచి ఇద్దరు పెద్దలు తలపడే సూచనలు ఇప్పటికే బయటకు వచ్చాయి. పర్చూరు నియోజకవర్గం నుంచి.. వైసీపీ తరపున దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరిల కుమారుడు హితేష్ చెంచురామ్.. పోటీ చేస్తారని ప్రచారం గుప్పుమంది. వైసీపీ తరపున తన కుమారుడి పోటీకి.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా.. అభిప్రాయసేకరణ జరిపారు. దీంతో.. అంతా రెడీ అయిందనుకున్నారు. కానీ.. దగ్గుబాటి చెంచురామ్.. అమెరికా పౌరసత్వం కోసం ధరఖాస్తు చేసుకున్నారు. ఇండియా పౌరసత్వాన్ని వదులుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ.. పత్రాలు సమర్పించారు. దాంతో.. ఆయన పోటీపై సందిగ్ధం నెలకొంది. ఈ సమయంలో వైసీపీ అధినేత జగన్.. ఓ మాస్టర్ ప్లాన్ వేశారని చెబుతున్నారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావే.. పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గలో నిలబడాలని జగన్మోహన్ రెడ్డి ఆఫర్ ఇచ్చారని.. వైసీపీలో ప్రచారం గుప్పుమంది. పర్చూరులో వైసీపీకి సరైన లీడర్ లేరు. గత ఎన్నికల్లో పోటీ చేసిన గొట్టిపాటి భరత్… ఈ సారి పోటీ చేయడం లేదని తేల్చి చెప్పారు. ఆ తర్వాత జగన్ ఇద్దరు సమన్వయకర్తల్ని మార్చినప్పటికీ.. ప్రయోజనం లేకపోయింది. అక్కడ వైసీపీకి సరైన నాయకత్వం లేదు. ఈ సమయంలో గతంలో అక్కడ్నుంచి రెండు సార్లు పోటీ చేసి గెలిచిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు అయితే సరైన అభ్యర్థి అని జగన్ భావిస్తున్నారు. అందుకే ఆయననే పోటీ చేయాలని కోరుతున్నారు. అయితే.. పురందేశ్వరి బీజేపీలో ఉండగా.. తాను వైసీపీలో చేరి పోటీ చేస్తే.. తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంమతో ఆయన ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అయినా.. వైసీపీ అభ్యర్థిగా దగ్గుబాటే అవుతారని వైసీపీ నేతలు నమ్మకంగా ఉన్నారు.
ఇలాంటి పరిస్థితి వస్తుందని.. టీడీపీ నేతలు ముందుగానే ఊహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా… ఈ పరిణామాలపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. పర్చూరులో.. .దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ అభ్యర్థి అయితే… ఆయనకు పోటీగా… కరణం బలరాంను నిలబెడతామనే సూచనలను పార్టీలోకి పంపారు. దగ్గుబాటికి కరణమే బలమైన అభ్యర్థి అవుతారన్న ప్రచారం ఉంది. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు.. తన పని తీరు విషయంలో అధినేతను మెప్పించారు. కానీ… రాజకీయంగా చూస్తే.. దగ్గుబాటికి ఢీకొట్టే నేత కాదు. అందుకే కరణం బలరాం వైపు చంద్రబాబు చూస్తున్నారు. కరణం వర్గానికి పర్చూరులోనూ గట్టి పట్టు ఉంది. టీడీపీలో ఉన్న గొట్టిపాటి వర్గీయులు సహకరిస్తే.. కరణం దగ్గుబాటి మధ్య హోరాహోరీ సాగుతుందన్న అభిప్రాయం ఉంది.