ఆంధ్రప్రదేశ్లో వరద బీభత్సం అలాంటిలాంటిది కాదు. విశాఖ రూపు రేఖలు మార్చేసిన హుదూద్ కన్నా ఘోరంగా ఉంది. ప్రాణ నష్టం ఎంత జరిగిందో స్పష్టంగా అంచనా వేయలేని పరిస్థితి. నిజానికి మానవ తప్పిదాల వల్ల జరిగిన ఘోరమైన నష్టమే ఎక్కువగా ఉంది. ప్రాణనష్టం లేకుండా కాపాడుకోగలిన సమయం కూడా ఉంది. కానీ అధికార యంత్రాంగంలో పేరుకుకుపోయిన ఓ రకమైన జడత్వం కారణంగా భారీ నష్టం జరిగింది.ఇప్పుడు ఆ దృశ్యాలు అందర్నీ కలచి వేస్తున్నాయి. బౌద్ధ గురువు దలైలామా కూడా చలించిపోయి సీఎం జగన్కు లేఖ రాశారు. బాధితుల్ని ఆదుకోవాలని కోరారు.
అయితే ఇక్కడ సీఎం జగన్ మాత్రం… దలైలామా ఆలోచించినంత కూడా ఆలోచించడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు వరదలు ముంచెత్తుతున్న సమయంలో ఆయన పెళ్లిళ్లకు వెళ్లారు. శని, ఆదివారాల్లో ఆయన రెండు వివాహ వేడుకలకు హాజరయ్యారు. కులాసాగా గడిపారు. అధికార యంత్రాంగానికి సరైన దిశా నిర్దేసం చేసే వ్యవస్థ లేక.. అడ్డదిడ్డంగా పని చేసుకుంటోంది. దీంతో బాధితులకు కనీస సాంత్వన లేకుండా పోయింది.
రహదారులు కోసుకుపోతే.. యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక ఏర్పాట్లు చేసి.. రవాణా ఆగకుండా చూసుకోవడం ప్రభుత్వాల విధి. జాతీయ రహదారులు కోతకు గురైతే మూడు రోజుల నుంచి ప్రయాణికులు రోడ్ల మీదనే ఉన్నారు. అనేక వాహనాలు ఆగిపోయాయి. వాటిని ఆ రహదారి కొట్టుకుపోయిన ప్రాంతం నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసైనా ముందుకు పంపిద్దామన్న ఆలోచన చేయలేదు. ఇక అధికారయంత్రాంగం.. ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుపైనా విమర్శలు వస్తున్నాయి. ఏపీలో ఉన్న వారికి రాయలసీమ కష్టాలు పట్టడం లేదు కానీ..బయట ఉన్న వారికి మాత్రం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.