వైసీపీ నేతలు తనను దారుణంగా వేధించారని ఆరోపిస్తూ.. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మహిళా డాక్టర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. గత డిసెంబర్లో చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గం)లోని పెనుమూరు ప్రభుత్వ వైద్యశాలలో అనితారాణి అనే డాక్టర్ విధుల్లో చేరారు. కింది స్థాయి సిబ్బంది అవినీతిని ప్రశ్నించినందుకు ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయి. జనతా కర్ఫ్యూ రోజున.. తనను హాస్టల్ గదిలో నిర్బంధించి.. .వైసీపీ నేతల్ని పిలిపించారని.. వారంతా.. తనను వేధించారు. దుర్భాషలాడారని అనితా రాణి ఆరోపిస్తున్నారు.
బాత్రూమ్లోకి వెళ్లినా ఫొటోలు, వీడియోలు తీశారని.. కోర్టులో వేసిన పిటిషన్లోనూ పేర్కొన్నారు. వైసీపీ నేతల వేధింపులకు సాక్ష్యాలుగా వీడియోలు కూడా ఉన్నాయని.. ఆ వీడియోలతో.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని డాక్టర్ అనితా రాణి అంటున్నారు. ఉన్నతాధికారులతో ఫోన్ చేయించి ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల కిందట… అనితా రాణి.. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితకు ఫోన్ చేసి.. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నారు. సుధాకర్ విషయంలో వంగలపూడి అనిత పోరాడుతూండటంతో.. ఆమెకు ఫోన్ చేసి తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పారు. అప్పుడే ఈ విషయం హైలెట్ అయింది.
వైసీపీ నేతల వేధింపులకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయంటున్న అనితారాణి.. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. సుధాకర్ విషయంలో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పటికే వివాదాస్పదమయింది. హైకోర్టు సీబీఐ విచారణకు కూడా ఆదేశించింది. ఇప్పుడు డాక్టర్ అనితా రాణి ఆరోపణలు కూడా.. కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.