దాసరి నారాయణరావు మరణించి రెండేళ్లు కావొస్తోంది. అయితే ఆయన ఆస్తుల పంపకానికి సంబంధించిన గొడవలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. దాసరికి ముగ్గురు సంతానం. ప్రభు, అరుణ్, హేమాలయ కుమారి. దాసరి తన వీలునామాలో ఆస్తుల్ని ఎవరెవరికి పంచాలో స్పష్టంగా రాయలేదు. ఆ బాధ్యతని సినీ రంగంలో అత్యంత సన్నిహితులైన మోహన్‌బాబు, మురళీమోహన్లకు అప్పగించారు. దాసరి మరణించిన యేడాదిలోగానే వీళ్లిద్దరూ… దాసరి సంతానానికి ఆస్తులు పంచినట్టు తెలుస్తోంది.
అయితే ఈ పంపకంలో కుమార్తె హేమాలయ కుమారికి కాస్త అన్యాయం జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాంతో హేమాలయ కుమారి మోహన్‌బాబుపై బహిరంగంగానే విమర్శలకు దిగింది. ఆస్తుల పంపకం విషయంలో తమకు అన్యాయం చేసిందని ఆరోపించింది. ఇప్పుడు ఈ విషయాన్ని మోహన్‌బాబు కూడా అంగీకరించడం ఆసక్తికరమైన అంశం. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమానికి మోహన్‌బాబు అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా దాసరి విషయం స్మరణకు వచ్చింది. దాసరి తనపై పెట్టిన బాధ్యతని అనివార్యకారణాల వల్ల సక్రమంగా నిర్వహించలేకపోయానని, దాసరి వారసులకు ఆస్తుల పంపకం విషయంలో అన్యాయం జరిగిందని ఒప్పుకున్నారు.
దాసరి వీలునామాలో ఎవరికెంత ఆస్తులు ఇవ్వాలో స్పష్టంగా పేర్కొనక పోవడం వల్ల ఈ ఇబ్బంది కలిగింది. నిజానికి దాసరి చివరి రోజుల్లో ఆస్తుల పంపకంలో స్పష్టంగా ఉండాలని సన్నిహితులు దాసరికి సలహా ఇచ్చారు. కానీ అవేం దాసరి పట్టించుకోలేదని వినికిడి. తాను మళ్లీ పూర్తి ఆరోగ్యవంతుడవుతానని గట్టి నమ్మకంతో ఉండేవారట దాసరి. అందుకే వీలునామా రాసే విషయంలో ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. దాసరికి జూబ్లీహిల్స్ ఓ ఖరీదైన బంగ్లా ఉంది. హైదరాబాద్ శివార్లలో కోట్లు విలువ చేసే ఫామ్‌హౌస్ ఉంది. ఇవి కాక కోట్లాది రూపాయల స్థిరాస్థి ఉంది. వీటి గురించే… వారసల మధ్య గొడవలు తలెత్తాయి. ప్రస్తుతానికి ఆ గొడవలు సద్దుమణిగాయని, అయితే ఆస్తుల పంపకం విషయంలో దాసరి కుమార్తె మాత్రం చాలా అసంతృప్తితో ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.