రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేసరికి తెలంగాణలో రాజకీయ సమీకరణాలు నెమ్మదిగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. నిజానికి, రేవంత్ బయటకి వెళ్లారన్న బాధ టీడీపీ వర్గాల్లో పెద్దగా లేదు. ఆయన వెళ్లడం వల్ల తమకు అవకాశం వచ్చినట్టుగా ఇతర టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇక, తెరాస విషయానికొస్తే.. చేరికలు పెంచడంపైనే ప్రత్యేక దృష్టి పెడుతోంది. తెలంగాణలో మారిన సమీకరణాల నేపథ్యంలో డోలయామానంలో పడ్డ పార్టీ ఏదైనా ఉందంటే… అది భారతీయ జనతా పార్టీ అని చెప్పాలి. వలసలపై వారు ఎన్నో ఆశలు పెట్టుకుంటే, ఇప్పుడు సీన్ అంతా కాంగ్రెస్ వైపు మారిపోయింది. పార్టీ మారాలనుకునేవారికి కాంగ్రెస్, లేదా తెరాస గమ్యంగా కనిపిస్తున్నాయి. దీంతో వలసలపై ఆశలు పెట్టుకున్న భాజపా భంగపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోందని సమాచారం! భాజపాలో చేరాలనుకునేవారికి సీనియర్ నేత నాగం జనార్థన్ ని ఆదర్శంగా చూపుతున్నారట!
మధ్యలో నాగం ప్రస్థావన ఎందుకంటే… భాజపాలో చేరాక పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పడానికి ఉదాహరణగా చూపిస్తున్నారట! భారతీయ జనతా పార్టీలో చేరితే ప్రాధాన్యత ఉండదనీ, నాగం విషయంలో అదే జరిగిందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. క్రమశిక్షణ, నియమావళి అంటూ ఆ పార్టీలో కొత్తవారికి సరైన అవకాశాలు లేకుండా చేస్తారనీ, రాష్ట్రస్థాయి నాయకులకు స్వేచ్ఛ ఉండదనీ, కొత్తగా వచ్చినవారు ఎంత సీనియర్లు అయినాసరే.. వాళ్లని జూనియర్లుగానే జాతీయ నాయకత్వం చూస్తుందనే చర్చ జరుగుతోందట! టీడీపీలో ఉండగా నాగం ఒక వెలుగు వెలిగారనీ, భాజపాలో చేరాక కనీసం ఆయన సలహాలుగానీ, సూచనలుగానీ పార్టీ తీసుకుంటున్న సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోందట. కాబట్టి, భాజపా వైపు చూసే ఆశావహులకు నాగం రూపంలో భవిష్యత్తు కనిపిస్తోందట!
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు వలసలపైనే భాజపా కేంద్ర నాయకత్వం చాలా ఆశలు పెట్టుకుంది. తాజాగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా రాష్ట్ర నేతలకు ఈ దిశగానే మార్గనిర్దేశం చేశారు. మరో నెలలోపు కొంతమంది నేతల్ని పార్టీలో చేర్చాలంటూ టార్గెట్ పెట్టినట్టు తాజాగా కథనాలు వచ్చాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే ఇలా ఉంది. భాజపాలో చేరితే గుర్తింపు ఉండదనే చర్చ జరుగుతూ ఉండటం, దానికి నాగం కెరీర్ ను ఉదాహరణగా చూపిస్తుండటం అనేది భాజపాకి ఇబ్బందికరమైన అంశమే. మరి, దీన్ని అధిగమించి, పార్టీలో భవిష్యత్తు బాగుంటుందనే భరోసా కల్పించే ఉదాహరణ కోసం రాష్ట్ర నేతలు అన్వేషించాల్సిన పరిస్థితే ఉంది.