ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీ ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారని వారి వివరాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విజయవాడలో మీటింగ్ పెట్టి సంచలన ఆరోపణలు చేసినప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పుడు అందరి దృష్టి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మల్సీ కవిత మీద ఉంది. ఇప్పుడు ఏపీలోనూ ఈ లిక్కర్ స్కాం జాడలు బయటపడుతున్నాయి. బీజేపీ నేతలు ఆరోపణలే చేశారు.. టీడీపీ నేతలు ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైఎస్ భారతి, విజయసాయిరెడ్డిలకు సంబంధం ఉందని కొన్ని పత్రాలు విడుదల చేశారు.
డిల్లీలో లిక్కర్ స్కాం కేసులో ఉన్న కంపెనీలకు ఆర్థిక సాయం చేసింది అరబిందో శరత్ చంద్రారెడ్డి. ఈయన విజయసాయిరెడ్డి వియ్యంకుడి సోదరుడు. వీరి ట్రైడెంట్ లైఫ్ సెన్సెస్ సాక్షిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. సీబీఐ కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడీ కంపెనీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న పలు కంపెనీలకు పెట్టుబడి పెట్టింది. విజయసాయిరెడ్డిది టీడీపీ నేతలు చెబుతున్న అదాన్ డిస్టిలరీస్ కు చెందిన వారు కూడా ఈ స్కాంలో భాగమయ్యాయని .. టీడీపీ తరపున లిక్కర్ కేసుల వ్యవహారాలను చూస్తున్న ఆనం వెంకటరమణారెడ్డి ప్రకటించారు. ఈ వివరాలను ఆయన మీడియా ప్రతినిధులకు అందించారు.
ప్రస్తుతం సీబీఐ శరత్ చంద్రారెడ్డిని ప్రశ్నిస్తోందని ఆయన చెబుతున్నారు. లిక్కర్ స్కాంలో వైఎస్ భారతి, విజయసాయిరెడ్డి నిండా మునిగిపోయారని.. జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లడానికి ఈ కేసు వెలుగులోకి రావడమే కారణమని చెబుతున్నారు. ఈ కేసును లోతుగా విచారిస్తే.. ఏపీలో లిక్కర పాలసీ వ్యవహారాలన్నీ వెలుగుచూస్తాయంటున్నారు. అదాన్ డిస్టిలరీస్ ద్వారా ఏపీలో సేకరించిన వేల కోట్ల సొమ్మునే .. పెట్టుబడిగా పెడుతున్నారని.. ఆనం అంటున్నారు. అయితే అదేమీ చిన్న కాసే కాదని.. చాలా పెద్దదేనని అంచనా వేస్తున్నారు.