హైదరాబాద్: తెలంగాణవాదులు ఇక ప్రత్యేక హైకోర్టుకోసం ఉద్యమం ప్రారంభించబోతున్నారు. హైకోర్టు విభజనపై చొరవ చూపాలని టీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు ఇవాళ విజ్ఞప్తి చేశారు. వినోద్ కుమార్, కవిత, కేశవరావు, జితేందర్ రెడ్డి, నర్సయ్య గౌడ్, సీతారాం నాయక్ తదితర ఎంపీలు రాజ్‌భవన్‌కు వెళ్ళి నరసింహన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ విషయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడతానని గవర్నర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఉమ్మడి హైకోర్టును విభజించాలని చట్టంలో ఉందని, అయినా విభజన జరగకపోవటం బాధాకరమని అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో హైకోర్టు విభజనబిల్లును ప్రవేశపెట్టకపోతే పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం హైకోర్టుకోసం ఏర్పాట్లు చేసుకోవటంలేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడి విదేశ పర్యటనలలో ఎక్కువగా, రాష్ట్ర పర్యటనలలో తక్కువగా గడుపుతున్నారని విమర్శించారు.