కరోనా దెబ్బకు అమెరికా వణికిపోతూంటే.. తాజాగా… పోలీసుల ఆకృత్యం వల్ల ఆఫ్రికన్ అమెరికన్ మరణించడం.. మరింతగా ఇబ్బంది పెడుతోంది. నల్ల జాతీయుడిని పోలీసుల అకారణంగా చంపడంపై నిరసనలు హింసకు దారి తీసేలా జరుగుతున్నాయి. అవి అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇతర చోట్లకు వ్యాపిస్తూనే ఉన్నాయి. వారం రోజుల కిందట.. ఫ్లాయిడ్ అనే ఆఫ్రికా అమెరికన్ చేతులకు బేడీలు వేసి రోడ్డుపై పడేసి అతడి మెడపై మోకాలితో తొక్కుతూ ఓ పోలీస్ పైశాచికానందం పొందాడు. చివరికి ఫ్లాయిడ్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ వీడియో అమెరికాలోని నల్లజాతీయుల రక్తాలను మరిగించింది.
జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై నిరసన సెగలు చెలరేగాయి. ఘటన జరిగిన మిన్నియాపొలిస్ నుంచి అన్ని రాష్ట్రాలకు, నగరాలకు విస్తరించాయి. ఫ్లాయిడ్ మృతికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలంటూ అమెరికన్లు రోడ్డెక్కారు. పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. నిరసన ప్రదర్శనల్లో లూటీలు జరుగుతున్నాయి. దీంతో అమెరికాలో ఇప్పుడు పరిస్థితి గంభీరంగా మారింది. చోట్ల పలు దుకాణాలు, వ్యాపార సముదాయాలకు నిప్పు పెట్టారు. కొన్ని మాల్స్, వాహనాలపై రాళ్లు రువ్వడం వంటివి చోటు చేసుకున్నాయి. ఫ్లాయిడ్ మృతికి కారణం అయిన పోలీసులపై చర్యలు తీసుకుంటే.. నల్లజాతీయులు శాంతిస్తారని అనుకున్నారు. కానీ ఆ పోలీస్‌ను అదుపులోకి తీసుకున్న నిరసనలు అలా పెరుగుతూనే ఉన్నాయి.
ఈ నిరసనలను డీల్ చేయడానికి ప్రయత్నించకపోగా.. ట్రంప్ మాటలతో మరింతగా పరిస్థితి విషమిస్తోంది. లూటింగ్ చేసేవారిని షూట్ చేయాలంటూ.. ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమయింది. సైన్యాన్ని రంగంలోకి దింపుతామంటూ వస్తున్న హెచ్చరికలు.. నల్లజాతీయుల్ని మరింతగా రెచ్చగొట్టేలా ఉన్నాయి. న్యూయార్క్‌లో 2014లో ఎరిక్ గార్నర్ అనే నల్లజాతి వ్యక్తి హత్య తర్వాత అమెరికాలో జాతివివక్ష దాడులపై ఆందోళనలు పెరిగాయి. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ పేరుతో ఆందోళకారులు ఈ తరహా దాడులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఇప్పడు ఫ్లాయిడ్ మృతి అమెరికాను కుదిపేస్తోంది.