మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, దోమల బెడద నుండి కాపాడాలన్న సోయే లేని అధికారులు… ఫలితంగా హైదరాబాద్ వ్యాప్తంగా డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి ఏరియాలోనూ డెంగ్యూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
వర్షాకాలం కావటంతో చాలా చోట్ల నీరు నిల్వ ఉంటోంది. అక్కడ దోమలు స్థావరం ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ మున్సిపల్ అధికారులకు బాగా తెలుసు. ప్రతి సంవత్సరం లాగా ఈ ఏడాది కనీసం డ్రైడే పై జీహెచ్ఎంసీ కనీసం ప్రచారం కూడా చేయలేదు. పరిసరాల పరిశుభ్రతపై సెలబ్రిటీలతో అవగాహన కల్పించే ప్రయత్నం కూడా చేయలేదు. దానికి తోడు దోమల బెడద తప్పించేందుకు యాంటీ లార్వా స్ప్రే సంగతే మరిచిపోయారు. ఫాగింగ్ ఊసే లేదు. ఫలితంగా దోమలు విపరీతంగా పెరిగిపోయాయి.
రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ కేసుల పెరుగుదల ఉన్నా… గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే చాలా ఎక్కువ కేసులు వస్తున్నాయి. ఈ ఏడాదిలోనే దాదాపు 600కేసులు అధికారికంగా నమోదయ్యాయి. అనధికారికంగా మరో 1000 కేసులయినా ఉంటాయి.
ఇక డెంగ్యూ బాధితులంతా సాధారణ జ్వరమేనేమో అనుకొని ఆలస్యంగా ఆసుపత్రులకు వస్తున్నారు. దీంతో ఆసుపత్రిలో చేరిన రెండు మూడు రోజుల్లోనే ప్రాణాలపైకి వస్తోంది. ప్లేట్ లెట్లు పడిపోతున్నాయి. ఆసుపత్రికి వస్తున్న జ్వరాల కేసులో అధిక భాగం డెంగ్యూ వంటి కేసులే ఉంటున్నాయి. కొందరిలో కిడ్నీ సంబంధిత వ్యాధులకు కారణం అవుతుండగా, మరికొందరిలో కీళ్ల నొప్పులు కూడా కనిపిస్తున్నాయి.
వర్షాకాలం పూర్తయ్యే వరకు ప్రజలు అలర్ట్ గా ఉండకపోతే పెను ప్రమాదమే ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.