ఈనెల 27న ఎన్టీఆర్ – కొరటాల శివ ‘దేవర’ విడుదల కానుంది. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి 3 పాటలు వచ్చాయి. తొలి రెండు పాటలూ స్లో పాయిజన్‌లా ఎక్కేశాయి. మూడో పాటపై మిశ్రమ స్పందన వస్తోంది. ట్యూన్ క్యాచీగా లేదని కొందరు అంటుంటే, ఇంకొందరు ఎన్టీఆర్ తన స్టెప్పులతో గట్టెక్కించేశాడని సర్దుకుపోతున్నారు. ఈ సినిమా నుంచి మరో పాట మాత్రమే బాకీ ఉందని తెలుస్తోంది. దాంతో పాటు ట్రైలర్ రావాల్సివుంది.
ఇప్పటికే ట్రైలర్ కట్ చేసేసింది చిత్రబృందం. 2 నిమిషాల 10 సెకన్ల పాటు సాగే ట్రైలర్ ఇది. ప్రస్తుతం ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. వినాయక చవితి నాటికి ట్రైలర్ రెడీ అయిపోతుంది. అయితే ఎప్పుడు విడుదల చేయాలి? అనే విషయంపై తర్జన భర్జనలు పడుతున్నారు. ‘దేవర’కు సంబంధించి ఒక్క ఈవెంట్ కూడా ఇప్పటి వరకూ జరగలేదు., ట్రైలర్ లాంచ్ తో ప్రచారం మొదలెడదామా, లేదంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ వరకూ ట్రైలర్‌ని అట్టిపెడదామా అనే విషయంలో చర్చలు జరుగుతున్నాయి. గట్టిగా లెక్కేస్తే మరో 3 వారాల సమయం ఉంది. ఈలోగా ఫ్యాన్స్ లో జోష్ పెంచాలంటే ‘దేవర’ టీమ్ ఏదో ఒక ప్రమోషన్ యాక్టివిటీ చేస్తూనే ఉండాలి. సినిమా నిడివి విషయంలోనూ కొరటాల శివ ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. సినిమా మొత్తం 3 గంటల వరకూ వచ్చిందట. అందులో కనీసం 15 నిమిషాలు ట్రిమ్ చేసే పనిలో పడ్డారాయన. త్వరలోనే ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది.