కొడాలి నాని.. తెలుగుదేశం పార్టీ హిట్‌లిస్ట్‌లో ఉన్న నేతల్లో ఒకరు. మహిళా నేతల్లో రోజా.. నోరు ఎంత పెద్దతో.. మగ నేతల్లో కొడాలి నాని నోరు అంత కంటే పెద్దదని.. టీడీపీ నేతలు.. మండి పడుతూ ఉంటారు. చంద్రబాబును, ఆయన కుటుంబసభ్యులను వ్యక్తిగతంగా తిట్టడానికి కొడాలి నాని ఏ మాత్రం సంకోచించరు. అందుకే ఈ ఇద్దర్నీ ఈ సారి అసెంబ్లీకి రానివ్వకూడదన్న పట్టుదలను… టీడీపీ నేతలు ప్రదర్శిస్తున్నారు. కొడాలి నాని విషయంలో ఇప్పటికే.. పెద్ద స్కెచ్ అమలు చేశారు. ఆయన అనుచరుల్ని.. ద్వితీయశ్రేణి నేతల్ని పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు అభ్యర్థిని కూడా ఎవరూ ఊహించని విధంగా… దేవినేని నెహ్రూ తనయుడు.. దేవినేని అవినాష్‌ను రంగంలోకి దించాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు.
మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో ఎన్టీఆర్ పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత కొడాలి నాని తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. కానీ తర్వాత ఆయన వైసీపీలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో నాని వైసిపి నుంచి పోటీ చేసి.. విజయం సాధించారు. కొడాలి నాని టీడీపీ నుంచి వెళ్లిపోయిన తర్వాత రావి వెంకటేశ్వరరావు టీడీపీ ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. అభ్యర్దుల ఎంపిక కోసం నిర్వహించిన సమీక్షలో గుడివాడ అభ్యర్థి పేరుపై చర్చ జరిగింది. కానీ ఖరారు చేయలేకపోయారు. గుడివాడ నియోజకవర్గ నేతలందరినీ పిలిపించి మాట్లాడిన తర్వాత.. టిక్కెట్ ఖరారు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇన్చార్జ్ గా ఉన్న రావి వెంకటేశ్వరరావు ఈ సారి అభ్యర్థి కాదని.. మాత్రం స్పష్టమయిపోయిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు దేవినేని అవినాష్ ను గుడివాడ నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే చర్చ కొంత కాలంగా టీడీపీలో సాగుతోంది. ముఖ్యమంత్రి వద్ద కొంతమంది నేతలు కూడా ఈ మేరకు ప్రతిపాదించారు. అయితే స్థానికంగా ఉన్న నేతలందరినీ పిలిపించి మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే స్థానిక నేతలు.. మాత్రం… గుడివాడకు చెందిన నేతనే అభ్యర్థిగా ఎంపిక చేయాలని కోరుతున్నారు. పిన్నమనేని బాబ్జికి అనుకూలంగా కొంతమంది సిఫార్సు చేశారు. అయితే స్థానిక నేతలందరినీ ఒప్పించి దేవినేని అవినాష్ ను రంగంలోకి దించాలని హై కమాండ్ భావిస్తుంది. చంద్రబాబు పేరు నిర్ణయించుకున్నారు కానీ.. అందరికి సర్ది చెప్పడానికి సమయం తీసుకుంటున్నారన్న ప్రచారం టీడీపీలో జరుగుతోంది. అంటే.. ఈ సారి గుడివాలో కొడాలి వర్సెస్ దేవినేని అన్నట్లుగా సాగనుంది.