ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ పండుగ కోసం పులివెందుల వెళ్లారు. ప్రతీ ఏటా వెళ్తారు అది సహజమే. అలాగే ఆయనకు స్వాగతం చెబుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ సారి కూడా ఏర్పాటు చేశారు. అయితే అన్ని ఫ్లెక్సీల్లో కల్లా అందర్నీ ఆకర్షిస్తున్నవి కొన్నే. ఆ ఆకర్షణ ఎందుకంటే.. వాటిని ఏర్పాటు చేసింది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కాబట్టి. ప్రస్తుతం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితునిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి జైల్లో ఉన్నారు. ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. అయినప్పటికీ ఆయన పేరు మీద పులివెందులలో పదుల సంఖ్యలో ఫ్లెక్సీలు వెలశాయి. ముఖ్యంగా సీఎం జగన్ వెళ్లే దారిలోనే అవిఎక్కువగా ఉన్నాయి.
దేవిరెడ్డి శంకర్ రెడ్డి జైల్లో ఉంటే.. ఆయన పేరుతో ఎవరు ఏర్పాటు చేశారా అనే డౌట్ ఎవరికీ రాలేదు. ఎందుకంటే ఆయన కోసం పని చేసే వాళ్లు బయట చాలా మంది ఉన్నారు. ఆయన సూచనలు పాటించే వాళ్లు కూడా ఉన్నారు. అంతే కాదు ఆయనను కాపాడటానికి ప్రయత్నించేవారు కూడా ఎక్కువ మందే ఉన్నారు. అయితే ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఎందుకు అన్న సందేహమే చాలా మందికి వస్తోంది. అయితే దీని వెనుక ఓ ప్రత్యేకమైన కారణం ఉందని.. పులివెందులలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వైఎస్ వివేకా కేసు తమకు చుట్టుకుంటుందని తెలిస్తే.. వైఎస్ ఫ్యామిలీ కూడా మొత్తంగా దేవిరెడ్డి శంకర్ రెడ్డికి వదిలేసి . తమకేమీ తెలియదని బయటపడే ప్రయత్నం చేస్తారన్న ప్రచారంజరుగుతోంది.
ఈ పరిస్థితి రాకుండా… తమను మర్చిపోకుండా.. గుర్తుంచుకోవాలని.. కాపాడాలని గుర్తు చేయాలన్న వ్యూహంతోనే శివశంకర్ రెడ్డి ఈ ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ వివేకా కేసులో ఎవరి వ్యూహం వారు అమలు చేస్తున్నారు., బయటపడాలని కొందరు..బయటకు రావాలని కొందరు.. ఇతరులను ఇరికించాలని కొందరు ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.