సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తిరుమల కొండను కేంద్ర ప్రభుత్వ విభాగం అయిన డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ అధికారి అయిన ధర్మారెడ్డి గుప్పిట్లో పెట్టారు. ఆయనకు హోదా లేకపోయినా జేఈవో.. తర్వాతా ఈవో ఇచ్చారు. ఆయన డిప్యూటేషన్ కాలం గడిచిపోయినా .. కేంద్రంతో లాబీయింగ్ చేసుకుని పొడిగించుకుటూ వస్తున్నారు. ఇలా ఐదేళ్ల పాటు డిప్యూటేషన్ పొడిగించడం అసాధారణం అనుకుంటే… రిటైర్మెంట్ ముందు.. నెలన్నర రోజులు కూడా… ఆయన డిప్యూటేషన్ పొడిగించాలని కేంద్రం వద్దకు జగన్ ప్రతిపాదన పెడుతున్నారు.
రెండేళ్ల కిందట ధర్మారెడ్డికి లభించిన డిప్యూటేషన్ పొడిగింపు మే 14తో ముగుస్తుంది. జూన్ 30వ తేదీన ఆయన రిటైర్ అవుతారు. ఈ నలభై రోజులు కూడా ఆయన టీటీడీలోనే ఉండారని.. డిప్యూటేషన్ పొడిగించాలని సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారు. ధర్మారెడ్డి లేకపోతే టీటీడీ అంతా అల్లకల్లోలం అయిపోతుందన్నట్లుగా లేఖలో కారణం చెప్పారు. కేంద్రానికి కావాల్సినట్లుగా సహకరించి ఇలాంటి పనులు చేయించుకోవడంలో సిద్ధహస్తులైన జగన్మోహన్ రెడ్డి.. మరోసారి పొడిగింపు తెచ్చుకోగలరో లేదో తెలియదు కానీ.. ధర్మారెడ్డి టీటీడీలో లేకపోతే జగన్ కు కాళ్లు , చేతులూ ఆడవేమో అన్నట్లుగా ఉందని ఎవరికైనా అర్థమైపోతుంది.
ధర్మారెడ్డి దేవుడిని ఉపయోగిచుకుని జగన్ రెడ్డి కోసం భయంకరమైన లాబీయింగ్ చేస్తారని దేశం మొత్తానికి తెలుసు. ఆయన టీటీడీ పదవిలో లేకపోతే ఆ లాబీయింగ్ సాధ్యం కాదన్న ఆందోళనలో జగన్ ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కొద్ది రోజులు కూడా ఆయన టీటీడీలో లేరన్న భావన ఊహించలేకపోతున్నారని అంటున్నారు.