టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు డిప్యూటేషన్ పెంచారు. అది నిబంధనలకు విరుద్ధం. అయినా సరే మరోసారి కేంద్రం నుంచి డిప్యూటేషన్ ఉత్తర్వులు పొడిగింపు చేయించుకున్నారు.
జగన్ రెడ్డి సీఎం అవగానే టీటీడీలో వాలిపోయిన ఆయన ఐఏఎస్ కాదు..ఐపీఎస్ కాదు.. కనీసం కన్ ఫర్డ్ ఐఏఎస్ కూడా కాదు. రక్షణ శాఖలో ఓ ఎస్టేట్ ఆఫీసర్. అదీ కూడా ఢిల్లీలో. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అనుబంధం పెంచుకుని తన లాబీయింగ్ తెలివితేటలతో జగన్ రెడ్డికి ఆత్మీయుడయ్యారు. టీటీడీని ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి ధర్మారెడ్డి. జగన్ కోసం దేవుడి పేరుతో లాబీయిగ్ చేయడంలో ఆయన అన్ని రకాల హద్దులనూ దాటేశారు. న్యాయమూర్తుల ఇళ్లలో శుభకార్యాలకు వెళ్లి ఖరీదైన గిఫ్టులు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయినా ఆయనకు పొడిగింపు లభించింది.
ధర్మారెడ్డి చేస్తున్న నిర్వాకాలపై ఎన్డీఏ కూటమిలోని నేతలు.. ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయనను టీటీడీ పోస్టు నుంచి తప్పించాలని కోరారు. కానీ ఎలాంటి స్పందన లేదు. చర్యలు తీసుకోకపోయినా రిటైరయ్యే ముందు మాతృ సంస్థలో రిపోర్టు చేయాల్సి ఉన్నా కాదని.. డిప్యూటేషన్ పొడిగింపు తెచ్చుకున్నారు. బీజేపీ దగ్గర.. కేంద్రం దగ్గర… వైసీపీ ధర్మారెడ్డికి ఉన్న పలుకుబడి అలాంటిది మరి.