విశాఖ రాజధాని అంటే ప్రజలు స్పందించడం లేదని ధర్మాన ప్రసాదరావు పదే పదే చెబుతున్నారు. ఆయన తాను ప్రజల్ని రెచ్చగొడదామని అనుకుంటున్నారో లేకపోతే.. నిజంగానే విశాఖ రాజధాని అంటే ప్రజలకు ఇష్టం లేదని చెప్పదల్చుకున్నారో కానీ దాదాపుగా ప్రతీ రోజూ ఇదే మాట అంటున్నారు. ఓ రోజు .. విశాఖ రాజధాని కోసం చేతులెత్తమని సభలో ఉన్న వారిని అడిగితే ఒక్కరూ ఎత్తలేదు. దీంతో వారంతా ఉత్తరాంధ్ర ద్రోహులేనని చిటపటలాడారు. తర్వాత పలు సందర్భాల్లోనూ ఆయనకు స్పందన కనిపించలేదు. తాజాగా అదే మాట అన్నారు. విశాఖ రాజధాని కోసం ఉత్తరాంధ్ర వాసులు నోరెందుకు విప్పడం లేదని ఆయన ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు.
ధర్మాన మాటల్లో ఏమైనా ధర్మం ఉంటే ప్రజలు కూడా స్పందించి ఉండేవారు. ఏపీకి రాజధానిని నిర్ణయించే సందర్భం వచ్చినప్పుడు .. అమరావతిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఒక్కరంటే ఒక్కరు కూడా తము విశాఖ రాజధానిగా కోరుకుంటున్నామని చెప్పలేదు. చివరికి ధర్మాన కూడా అమరావతికే మద్దతు తెలిపారు. అలా మద్దతు తెలిపినందునే రైతులంతా భరోసాతో భూములిచ్చారు. ఇప్పుడు అధికారం మారిన తర్వాత .. భూ దందాల కోసం… తాము కబ్జా చేసిన భూములను రక్షించుకోవడం కోసం విశాఖ రాజధాని అంటే.. ప్రజలు కూడా అలాగే అనాలని ధర్మాన అనుకుంటున్నారు.
అమరావతి రైతులకు ఎంత అన్యాయం జరిగిందో రైతు అనే ప్రతి ఒక్కరికీ అవగాహన ఉంటుంది. వాళ్లు రాజధానికి భూములు త్యాగం చేశారు. అతి త్యాగం కాదు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం అని అన్నా.. సరే… రైతులకు.. అసలు నిజమేంటో తెలుసు. అందుకే రైతులు.. రైతు బిడ్డలెవరూ.. రైతులకు అన్యాయం చేయాలనుకోవడం లేదు. రేపు తమకూ అలాంటి పరిస్థితి రాదని గ్యారంటీ ఏమిటనేది వారి భయం. ధర్మాన అంటే.. మాజీ సైనికుల పేరుతో భూములు కొట్టేసి అడ్డంగా దొరికిపోయారు. సాక్ష్యాలతో సహా సిట్ రిపోర్టులో ఆ విషయం ఉంది. దాన్నుంచి బయటపడటానికి ఆయనకు ప్రజల్ని రెచ్చగొట్టడం తప్ప వేరే మార్గం లేదు. అందుకే ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు.